55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ రిలీజ్‌

By అంజి  Published on  25 Feb 2020 7:57 AM GMT
55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ రిలీజ్‌

ముఖ్యాంశాలు

  • మార్చి 6న విడుదలకానున్న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్
  • నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు 13, పరిశీలన 16న
  • నామినేషన్ల ఉపసంహరణ 18, పోలింగ్‌ 26న

ఢిల్లీ: రాజ్యసభ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్‌ విడుదల చేసింది. మొత్తం 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 6న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. కాగా నామినేషన్ల స్వీకరణ తుదిగడువు మార్చి 13గా పేర్కొంది.

నామినేషన్ల ఉపసంహరణ మార్చి 18న, నామినేషన్ల పరిశీలన మార్చి 16న జరగనుంది. మార్చి 26న 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు. 17 రాష్ట్రాల నుంచి మొత్తం 55 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు, తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహనరావు, కేవీపీ రామచంద్రరావుల పదవీకాలం ఏప్రిల్‌లో ముగియనుంది. కాగా ఏపీ కోటాలో రాజ్యసభకు వెళ్లిన కె.కేశవరావు పదవీకాలం కూడా ఏప్రిల్‌లోనే ముగియనుంది. టి.సుబ్బరామిరెడ్డి, తోట సీతారామలక్ష్మీ, మొహమ్మద్‌ అలీ ఖాన్‌ల పదవీకాలం ముగియనుండడంతో ఆస్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి.

రాజ్యసభ సభ్యులను ఆయా రాష్ట్రాల్లోని శాసనసభల సభ్యులు ఎన్నుకుంటారు. భారత పార్లమెంటు లోని ఎగువ సభను రాజ్యసభ అంటారు. రాజ్యసభ అంటే రాష్ట్రాల సభ అని అర్థం. రాజ్యసభ సభ్యుల సంఖ్య 250. ఇందులో 12 స్థానాలకు వివిధ రంగాల్లో ప్రసిద్ధులైనవారని రాష్ట్రపతి నామినేటు చేస్తారు. సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు.. ప్రతి రెండేళ్ళకు ఒకసారి మూడో వంతు సభ్యుల పదవీకాలం పూర్తవుతుంది.

రాజ్యసభకు సభాపతిగా ఉపరాష్ట్రపతి వ్యవహరిస్తారు. సభ్యుల నుండి ఒకరిని ఉపసభాపతిగా ఎన్నుకుంటారు. లోక్‌సభ మాదిరి రాజ్యసభకు కూడా శాసనాధికారం ఉంటుంది. అయితే ఆర్థిక బిల్లులకు సంబంధించి, రాజ్యసభ నిర్ణయాన్ని తోసిపుచ్చే అధికారం లోక్‌సభకు ఉంది. ఇతర బిల్లులకు సంబంధించి ఇరు సభల మధ్యా వివాదం తలెత్తినపుడు రెండు సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తారు.

Next Story