ఆ నలుగురూ ఎవరు.? ఆశావహులలో మొదలైన టెన్షన్..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Feb 2020 8:49 PM IST
ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీలో రాజ్యసభ సీట్లకు ఆశావహుల సందడి మొదలైంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమందికి ఎమ్మెల్సీలుగా అవకాశమిస్తామని జగన్ హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు శాసనమండలి రద్దు కావడంతో రాజ్యసభకు డిమాండ్ పెరిగింది.
ఆంధ్రప్రదేశ్ నుండి ఈ ఏప్రిల్‌లో మొత్తం నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవనున్నాయి. 2014 రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి 11, తెలంగాణాకు 7 రాజ్యసభ సీట్లు కేటాయించారు. అందులో ప్రస్తుతం ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ నేత కె.కేశవరావు, కాంగ్రెస్ సభ్యుడు ఎంఏ ఖాన్ ఏప్రిల్ 9న వదవీ విరమణ చేయాల్సి ఉంది. అలాగే మరో కాంగ్రెస్ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి, టీడీపీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మీ ఏప్రిల్ 10న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో నాలుగు రాజ్యసభ సీట్లకు ఖాళీలు ఏర్పడనున్నాయి.
దీంతో.. ఏపీ అసెంబ్లీలో సంఖ్యాబలం ఆధారంగా ఈ నాలుగు స్థానాలు అధికార వైసీపీకే దక్కనున్నాయి. ఇప్పటికే సీఎం జగన్ ఈ స్థానాలు ఎవరికి కేటాయించాలనే దానిపై ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో కేంద్రంతో సన్నిహిత సంబంధాల్లో భాగంగా ఈ నాలుగు స్థానాల్లో ఒకటి బీజేపీకి కేటాయిస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.
ఈ నేఫథ్యంలో చివరకు ఎవరికి అవకాశం దక్కుతుందనే ఉత్కంఠ వైసీపీ శ్రేణులలోనూ మొదలైంది. ఇప్పటికే వైసీపీ నుండి రాజ్యసభలో ఇద్దరు సభ్యులు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసిపి నుండి రాజ్యసభ సభ్యులు.
అయితే.. ఇప్పుడు ఖాళీ అయ్యే నాలుగు స్థానాల్లో సామాజిక, ప్రాంతీయ సమతుల్యతను పాటిస్తూ సభ్యుల ఎంపిక చేయనున్నారు. అందులో ప్రముఖంగా జగన్ నలుగురు పేర్లను వరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొదటి నుంచి వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా ఉంటున్న ఆళ్ల కుటుంబానికి చెందిన అయోధ్యరామిరెడ్డికి జగన్ రాజ్యసభ అవకాశమివ్వాలని భావిస్తున్నట్లు సమచారం.
అలాగే.. బీసీ కోటాలో నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సుదీర్ఘకాలం టీడీపీలో ఉండి తాజాగా వైసీపీలో చేరిన బీద మస్తాన్ రావుకు సైతం అవకాశం దక్కుతుందనే ప్రచారం సాగుతుంది.
ఇక.. ఎస్సీ కోటాలో 2014లో టీడీపీ నుంచి అమలాపురం ఎంపీగా గెలిచి, 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన పండుల రవీంద్రబాబు పేరు సైతం రేసులో ఉంది.
అంతేకాకుండా తాజాగా మరో ప్రముఖుడి పేరు కూడా ప్రచారంలోకొచ్చింది. న్యాయవ్యవస్థలో కీలకస్థానంలో పనిచేసిన ఓ వ్యక్తిని కూడా రాజ్యసభకు పంపాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే.. ఇందుకు ఆ ప్రముఖుడు మాత్రం అందుకు సిద్ధంగా లేరని కూడా తెలుస్తుంది.
ఇక ఎన్నికల సమయంలో పార్టీకి మద్దతుగా ప్రచారం చేసిన జగన్ బందువు, సినీనటుడు మోహన్ బాబు పేరు సైతం వైసీపీ నుంచి రాజ్యసభ రేసులో ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన కొద్దిరోజుల క్రితం ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యారు. దాని మర్మమెంటో తెలియకున్నా కలెక్షన్ కింగ్ పేరు కూడా గట్టిగానే వినపడుతుంది.
అలాగే.. వైసీపీ నుంచి మెగాస్టార్ చిరంజీవికి సైతం ఛాన్స్ దక్కే అవకాశమందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. సైరా సినిమా సమయంలో, మూడు రాజధానుల విషయంలో జగన్‌తో చిరు భేటీ కావడం ఈ వార్తలకు బలాన్నిస్తున్నాయి. ఇదిలావుంటే.. వైసీపీకి దక్కే నాలుగు సీట్లలో మూడు సీట్లు తమవారికి ఇచ్చుకున్నా.. ఒక సీటు మాత్రం బీజేపీకి ఇచ్చే అవకాశాలు లేకపోలేదనే వాదన కూడా ప్రస్తుతం.. రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ఉన్న వాదన.