బీజేపీ నేతల చెంప పగలగొట్టారు
By అంజి
అనుమతులు లేకుండా ర్యాలీలు చేసిన బీజేపీ నేతల చెంప పగల కొట్టారు మధ్యప్రదేశ్‌లోని రాజ్ గఢ్ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్లు. సంఘటన వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ లోని రాజ్ గఢ్‌లో అనుమతి లేకుండా బీజేపీ నాయకులు సీఏఏకు అనుకూలంగా తిరంగ యాత్రను నిర్వహించారు. బయోరాలో సెక్షన్ 144 అమల్లో ఉండగా, పౌరసత్వ సవరణ చట్టంకు మద్దతుగా ర్యాలీ నిర్వహిస్తున్న బీజేపీ కార్యకర్తలు కలెక్టర్‌తో గొడవకు దిగారు. అనుమతి తీసుకోకుండా ర్యాలీ ఎలా నిర్వహిస్తారని రాజ్ గఢ్ కలెక్టర్ నివేధిత, డిప్యూటీ కలెక్టర్ ప్రియా వర్మలు యాత్రను అడ్డుకున్నారు. కార్యకర్తలు ఎంతమాత్రమూ తగ్గకుండా తమ ర్యాలీ కొనసాగించారు.
బీజేపీ మాజీఎమ్మెల్యే కలెక్టర్ తో ఘర్షణ పడగా, డిప్యూటీ కలెక్టర్ తో కార్యకర్తలు ఘర్షణకు దిగారు. దురుసుగా ప్రవర్తించారు.ఈ క్రమంలో భారత్ మాతా కి జై నినాదాలు చేస్తూ తనతో వాగ్వివాదానికి దిగినా ఓ బీజేపీ కార్యకర్తను కలెక్టర్ చెంపదెబ్బ కొట్టారు. దీంతో అక్కడే ఉన్న మరికొందరు కార్యకర్తలు కూడా స్లోగన్స్ ఇవ్వడం ప్రారంభించారు. దీంతో సహనం కొల్పోయిన కలెక్టర్ గుంపులోకి వెళ్లి కార్యకర్తలను ఒక్కొక్కరిని కొట్టడం స్టార్ట్ చేశారు.
ఈ ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు స్వల్పంగా లాఠీ ఛార్జ్ చేశారు. హింసకు యత్నించిన బీజేపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. కాగా కలెక్టర్ బీజేపీ కార్యకర్తను చెంప చెళ్లుమనపించిన వీడియోను బీజేపీ నాయకుడు, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్ లో పోస్టు చేశారు.