కరోనా ఎఫెక్ట్ : కూలీగా మారిన క్రికెటర్
By మధుసూదనరావు రామదుర్గం Published on 29 July 2020 8:55 AM ISTకరోనా మహమ్మారి ప్రపంచ దేశాల స్థితిగతుల్ని అతలాకుతలం చేసేస్తోంది. ఈ అంటువ్యాధి దెబ్బకు బడుగు బలహీన వర్గాలే కాదు.. మధ్య దిగువ మధ్య తరగి ప్రజల ఆర్థిక స్థితి దయనీయంగా మారిపోతోంది. ఉద్యోగాలు పోయి కొందరు.. ఉద్యోగాలు రాక మరికొందరు.. వ్యాపారులు, క్రీడాకారులు.. అందరూ ఈ పీడ ఎప్పుడు తొలుగుతుందా అని దీనంగా ఎదురు చూస్తున్నారు. ఆర్థికభారంతోనో.. అప్పులు పుట్టకనో చాలా మంది దొరికిన పని చేసుకుంటు కాలం వెళ్లదీస్తున్నారు. అలాంటి అభాగ్యుడే ఉత్తరాఖండ్‌కు చెందిన వీల్‌చైర్ క్రికెటర్ రాజేంద్ర సింగ్.
కరోనా దెబ్బకు ఆటపాటలు,విందువినోదాలు అన్నీ బంద్ కావడంతో, క్రికెటే సర్వస్వమని నమ్ముకుని జీవిస్తున్న రాజేందర్ గత్యంతరం లేక మరోదారి కానరాక కూలీ అవతారమెత్తాడు. రాజేంద్రసింగ్ విధిని ఎదిరించి వీల్‌చైర్‌పై ఉన్నా మొక్కవోని ధైర్యంతో బతుకుబండి లాగుతున్న ధీశాలి. క్రికెటర్‌గా, కేప్టెన్ ఎన్నో అవార్దులు రివార్డులు, ట్రోఫీలు అందుకుని.. ఉంటే రాజేంద్రలా ఉండాలన్న స్థాయికి ఎదిగి ఓ వెలుగు వెలిగిన ఈ క్రీడాకారుడు.. ప్రస్తుతం ఆడే వీలు లేక చేతిలో చిల్లిగవ్వలేక అల్లాడిపోతున్నాడు. ఉపాధి దొరకక అల్లాడతున్న రాజేంద్ర సింగ్ పరిస్థితలతో రాజీపడి కూలీ అవతరామెత్తాల్సి వచ్చింది.
రాజేంద్ర సింగ్‌కు తన మూడో ఏటనే అంటే ఊహ తెలీని వయసులో పక్షవాతం వల్ల 90 శాతం వైకల్యంగా మారింది. అయినా తన అనన్య ప్రతిభతో క్రికెట్ నేర్చుకుని వీల్‌చైర్‌క్రికెటర్‌గా మారాడు. కొంతకాలానికి వీల్‌చైర్ క్రికెట్ జట్టుకు కేప్టన్‌గా మారి తనలాంటి దివ్యాంగుల్లో స్పూర్తి నింపాడు. తన కష్టానికి ప్రతిఫలంగా ఎన్నో విజయాలు, ప్రముఖుల ప్రశంసలు, అభిమానుల చప్పట్లు, ట్రోఫీలు లభించాయి. అయితే ఇవి లభిస్తాయని, తనకు గుర్తింపు వస్తుందని రాజేంద్ర అనుకోలేదు. తనపాటికి తను శ్రమిస్తూ వచ్చాడు. విజయం ఆయన వెంట పరుగులు తీస్తూ వచ్చింది. చాలా సందర్భల్లో పోరాడటానికి సక్రమ దేహమే అక్కర్లేదు. మనసు నిబ్బరంగా ఉంటే చాలు, వైకల్యం అడ్డూ కాదు అనడానికి రాజేంద్ర జీవితం చక్కని ఉదాహరణ.
కేవలం క్రికెట్ ఆటతో రాజేంద్ర తృప్తి పడలేదు. విద్యావంతుడేతే సమాజంలో మన్నన మర్యాద అనుకున్నాడు. చదువులపై దృష్టి పెట్టడమే కాకుండా అందుకు తగ్గట్టుగా కష్టించాడు. హిస్టరీలో మాస్టర్ డిగ్రీ అందుకున్నాడు. బీఎడ్ పూర్తి చేశాడు. అయితే మనం ఎంతగా ప్రగతి బాటలో దూసుకెళుతున్నా.. కొన్ని సార్లు అనుకోని ఇబ్బందులు చుట్టుముడతాయి. రాజేంద్రకూ అంతే! ఈ సారి కష్టం కరోనా రూపంలో వచ్చి కమ్మేసింది.
రాజేంద్ర మీడియాతో మాట్లాడుతూ ‘ఈ కరోనా రాకముందు అంతా బావుండేది. రుద్రపూర్‌లో విధివశాత్తు వీల్‌చైర్‌కే పరిమితమైన దివ్యాంగ పిల్లలకు క్రికెట్ కోచింగ్ ఇచ్చేవాణ్ణి. కరోనా పుణ్యమాని దానికి బ్రేక్ పడింది. ఇక చేసేది లేక నా స్వగ్రామం పితోరాఘర్‌లోని రాయ్‌కోట్‌కు వచ్చేశాను. ఇక్కడ అమ్మానాన్నలుంటారు. ఆరికి వయసైపోయింది. నా సోదరుడు గుజరాత్‌లోని ఓ హోటల్‌లో పనిచేస్తుండేవాడు. అయితే లాక్‌డౌన్ వల్ల ఆ పని పోయింది. ఈ నేపథ్యంలో ఎం.జి.ఎన్.ఆర్.జి.ఎ. యోజన కింద పనిచేస్తున్నా’ అని వేదనతో తెలిపాదు.
రాజేంద్ర దుస్థితి చూసి నటుడు నయా కర్ణుడు సోనుసూద్ తనకు రూ.11వేల ఆర్థిక సాయం అందించినట్టు తెలిపాడు. అలాగే పితోరాఘర్, రుద్రాపూర్‌లో మంచి మనసున్న కొందరు సాయం చేశారని వివరించాడు. ‘ ఈ కష్ట సమయంలో ఎలాంటి పనిచేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుతం పని ఇంటి దగ్గర్లోనే కాబట్టి నాకు ఇబ్బంది అనిపించడం లేదు’ అని వీల్‌చైర్ క్రికెట్ మాజీ కేప్టెన్ రాజేంద్ర సింగ్ అన్నాడు.