కోర్టు తీరుపై రాజస్థాన్ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు

By సుభాష్  Published on  23 July 2020 12:11 PM IST
కోర్టు తీరుపై రాజస్థాన్ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు

రాజస్థాన్ అధికార పార్టీలో నెలకొన్న రాజకీయ సంక్షోభం తాజాగా సుప్రీంకోర్టుకు చేరింది. ఈ క్రమంపై రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ నిర్ణయాన్ని నియంత్రించేలా హైకోర్టు స్టే ఇవ్వటాన్ని ఆయన తప్పు పట్టారు. ఇలాంటి నిర్ణయాలు రాజ్యాంగ సంక్షోభానికి తెర తీస్తాయన్నారు. రాజస్థాన్ అధికారపక్షం కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు పందొమ్మిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు వీలుగా స్పీకర్ వద్ద ఫైలు ఉండటం తెలిసిందే.

దీనిపై నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్ సిద్ధమవుతున్న వేళ.. తిరుగుబాటు ఎమ్మెల్యేలు రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో.. స్పీకర్ ఎదుట ఉన్నఎమ్మెల్యేల అనర్హత ఫైలుపై నిర్ణయం తీసుకోకుండా తాత్కాలికంగా స్టే జారీ చేశారు. ఈ నెల 24 వరకు ఇది అమలవుతుందని పేర్కొన్నారు. దీనిపై రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. కోర్టు తీరును ఆయన తప్పు పట్టారు.

రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ లో ఉన్న ఆర్టికల్ 212లో పేరా 6(2) ప్రకారం స్పీకర్ తీసుకునే చర్యల్లో కోర్టు జోక్యం చేసుకోకూడదన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వు చట్టవిరుద్ధమైనదని పేర్కొన్నారు. కోర్టు ఇలా వ్యవహరించటం స్పీకర్ కు ఉన్న అధికారాల్ని తగ్గించినట్లు అవుతుందన్నారు. ఇదిలా ఉంటే స్పీకర్ జోషి దాఖలు చేసిన పిటిషన్ పై తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయొద్దని సుప్రీంకోర్టును తిరుగుబాటు ఎమ్మెల్యేల తరఫున సచిన్ పైలెట్ కోరారు. ఉత్తర్వులు జారీ చేసే ముందు తన వాదననుకూడా వినాలని ఆయన కోరుతున్నారు.

ఇదిలా ఉంటే.. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నట్లుగా రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లాత్ ఆరోపించారు. కుట్రదారుల్లో కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఉన్నట్లుగా పేర్కొంటూ తాజాగా ఆ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. జరుగుతున్న అంశాలు మీకు తెలుసో లేదో తెలీదు. కానీ.. కొందరు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మోడీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్నికూల్చివేయాలని చూడటం ప్రజాతీర్పును అపహాస్యం చేసినట్లు అవుతుందని రాజస్థాన్ సీఎం వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపైనా.. ఆయన రాసిన లేఖపైనా ప్రధానమంత్రి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Next Story