రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసుల ఓవరాక్షన్‌

By అంజి  Published on  1 Jan 2020 9:20 AM GMT
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసుల ఓవరాక్షన్‌

రాజన్న సిరిసిల్లా జిల్లా పోలీసులు మద్యం సేవించిన ముగ్గురు యువకులకు బడితె పూజ చేశారు. చంద్రపేటలో న్యూఇయర్‌ వేడుకలు జరుపుకొని ఒకే బండి వెళ్తున్న ముగ్గురు యువకుల చెష్టలను పోలీసులు గమనించారు. ఈలలు వేస్తూ బైక్‌ వెళ్తున్న ఆ యువకులను పోలీసులు పట్టుకున్నారు. పొడవాటి కర్రతో మత్తు దిగే దాకా చితకబాదారు. బూతులు తిడుతూ యువకులను చుక్కలు చూపించారు. ఈ తతంగాన్ని కొందరు యువకులు అక్కడే ఉన్న బిల్డింగ్‌పై నుంచి వీడియో తీశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీడియో చూస్తున్న నెటిజన్స్‌ పోలీసులుపై మండిపడుతున్నారు. ఎంత తాగిన మరి ఇంత దారుణంగా కొట్టాలా అంటూ విమర్శలు చేస్తున్నారు. పోలీసులు ఇలాంటి శిక్షలు వేయడం ఏంటని స్థానికులు మండిపడుతున్నారు.

కాగా బహిరంగంగా మద్యం సేవించి గొడవ చేస్తున్నారని సీఐ తెలిపారు. యువకులు గొడవ చేయడాన్ని గమనించిన పెట్రోలింగ్‌ పోలీసులు వెంటనే వారిని చెదరగొట్టాడానికి ప్రయత్నించారని సీఐ పేర్కొన్నారు. పోలీసులు తమను కావాలనే కొట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమను పోలీసులు ర్యాగింగ్‌ చేశారని, మద్యం సేవించి పట్టుబడిన బైక్‌లను స్టేషన్‌ తీసుకువస్తే వదిలిపెడతామని అన్నారని బాధితులు చెప్తున్నారు. దీంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story