ఇదిగో నేను చేశా.. ఇక చేయాల్సింది ఎన్టీఆర్, రామ్‌చరణ్ లు
By తోట వంశీ కుమార్ Published on 20 April 2020 5:56 PM ISTకరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ను విధించారు. దీంతో సెలబ్రెటీలతో పాటు సామాన్యులు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ లాక్‌డౌన్ కాలంలో చాలా మంది సెలబ్రెటీలు వంట చేయడం, ఇంటి పనులు చేయడం వంటివి చేస్తూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. కొందరు ఛాలెంజ్‌లు సైతం విసురుకుంటున్నారు.
టాలీవుడ్ సంచలనం సృష్టించిన 'అర్జున్ రెడ్డి' చిత్ర దర్శకుడు సందీప్ వంగా తన భార్యకు ఇంటి పనుల్లో సాయం చేస్తున్న వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశాడు. ఇంట్లోని మహిళలతో పనులు చేయించకండి.. అంటే మగవారికి 'బీ ది రియల్ మేన్' అనే ఛాలెంజ్ ను విసిరాడు. ఇందుకు దర్శక దీరుడు రాజమౌళి పేరును నామినేట్ చేశాడు.
ఇక సందీప్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన రాజమౌళి సోమవారం ట్విట్టర్‌లో వీడియో అప్‌లోడ్ చేస్తానని చెప్పాడు. ఇక ఆయన చెప్పినట్లు.. తన భార్య రమా రాజమౌళికి ఇంటి పనుల్లో సాయం చేస్తున్న వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 'సందీప్ వంగా ఇచ్చిన టాస్క్ ను పూర్తి చేశాను. తారక్, రామ్‌చరణ్‌తో పాటు శోభూ యార్లగడ్డ, సుకుమార్, కీరవాణి లని కూడా నామినేట్ చేస్తున్నాను. బీ ది రియల్ మేన్ అంటూ' రాసుకొచ్చాడు జక్కన్న.
ప్రస్తుతం దర్శకదీరుడు ఆర్ ఆర్ ఆర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తుండగా.. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ కనిపించనున్నారు.