కరోనాను జయించిన రాజమౌళి కుటుంబం
By తోట వంశీ కుమార్ Published on 12 Aug 2020 1:22 PM GMTటాలీవుడ్ దర్శకదీరుడు రాజమౌళి కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ మహమ్మారిని జయించారు. తాజాగా వారికి నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లు రాజమౌళి అభిమానులతో పంచుకున్నారు. "రెండు వారాల క్వారంటైన్ పూర్తయింది. ప్రస్తుతం లక్షణాలేమీ లేవు. పరిస్థితి ఏంటో తెలుసుకునేందుకు టెస్టులు నిర్వహిస్తే మా అందరికీ నెగెటివ్ వచ్చింది. ప్లాస్మా దానం చేయాలని చూస్తున్నాం. అయితే, డాక్టర్లు మూడు వారాలు ఆగాలని అన్నారు. ప్లాస్మా దానానికి తగినన్ని యాంటీబాడీలు అభివృద్ధి చెందేందుకు సమయం పడుతుందని చెప్పారు" అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు.
ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్(రౌద్రం రణం రుధిరం). ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు నటిస్తున్న చిత్ర షూటింగ్ 70శాతం పూర్తి అయ్యింది. కరోనా కారణంగా ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడింది. ఈ చిత్రంలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా.. వారి సరసన అలియా భట్, ఒలివియా కనిపించనున్నారు. అజయ్ దేవగన్, శ్రియ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో తొలుత ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ఆ తర్వాత దర్శకుడు తేజతో పాటు.. మరికొందరు ఈ వైరస్ బారిపడ్డారు. ప్రస్తుతం వీరంతా హోం క్వారంటైన్‌లో ఉన్నారు.