తెలుగు రాష్ట్రాలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు
By సుభాష్ Published on 27 Aug 2020 7:22 AM ISTఏపీలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురియనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గురు, శుక్రవారాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, ఉత్తర, కోస్తాంధ్ర, యానం ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే రాష్ట్రంలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురియడంతో జలాశయాలు నిండుకుండలా కళకళలాడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరి పరివాహక గ్రామాలు, లంక గ్రామాలు ఇప్పుడిప్పుడు వరదల నుంచి కోలుకుంటున్నాయి. ఏపీలో ఇప్పటికే భారీ వర్షాలు కురిసి ఎంతో నష్టం వాటిల్లింది. ముంపు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లన్నీ జలమయమై రాకపోలకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
అలాగే శ్రీశైలం జలాశయానికి వరద ప్రవహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 8 గేట్లు పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువన వదులుతున్నారు. ఇన్‌ఫోన్ల 2 లక్షల 26,751 కాగా, ఔట్ ఫ్లో 2 లక్షల 54,434 క్యూసెక్కులు ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.80 అడుగులతో ఉంది.
అలాగే తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం రాష్ట్రంలో ఒకటి, రెండు చోట్లు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కాగా, పశ్చిమబెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలను ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ఇంకా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
కొనసాగుతున్న అల్పపీడనం
బంగాళాకాతంలో ఒడిశా తీరం వద్ద అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరిత ఆవర్తనం ఏర్పడింది. రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు వరకు 900 మీటర్‌ల ఎత్తున గాలులు వీచే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయి. బుధవారం మంచిర్యాల జిల్లా ర్యాలీ గ్రామంలో అత్యధికంగా 6.7 సెంటీ మీటర్ల వర్షాపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కుమ్రంభీం, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, వరంగల్, నల్గొండ, జనగామ, సూర్యాపేట ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రెండు రోజులు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.