విస్తారంగా వర్షాలు.. పది శాతం ఎక్కువే.!
By న్యూస్‌మీటర్ తెలుగు
నైరుతీ రుతుపవనాల వల్ల దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ ఏడాది సగటు వర్షపాతం కన్నా.. దేశవ్యాప్తంగా పది శాతం ఎక్కువ వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి ఐఎండీ, పీఐబీలు నేడు ట్వీట్లు పోస్టు చేశాయి. వివిధ రాష్ట్రాల్లో కురిసిన వర్షపాతం వివరాలను వెల్లడించాయి.
జూన్ ఆరంభంలో కేరళ మీదుగా దేశంలోకి ప్రవేశించే నైరుతీ రుతుపవనాలు దాదాపు అన్ని రాష్ట్రాలను తాకినట్లు ఆ రిపోర్ట్ చెబుతోంది. వివిధ రాష్ట్రాల్లో జూన్ ఒకటవ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు కురిసిన వర్షపాతం వివరాలను వెల్లడించారు. సెప్టెంబర్ 30వ తేదీతో సీజన్ ముగిసినా.. ఈసారి నైరుతీ ప్రభావం అక్టోబర్ 10వ తేదీ వరకు ఉండే అవకాశాలు ఉన్నట్టు ఐఎండీ పేర్కొన్నది.
ఈ ఏడాది నైరుతీ సీజన్‌లో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం 880.6 మిల్లీమీటర్ల వర్షం కన్నా.. పది శాతం ఎక్కువే వానలు పడ్డట్లు తెలుస్తోంది. దాద్రానగర్ హవేలీలో సగటు కన్నా అత్యధికంగా 60 శాతం వర్షపాతం నమోదైంది. కనీసం 20 రాష్ట్రాల్లో సగటు వర్షం పాతం రికార్డు అయ్యింది. కేవలం నాలుగు రాష్ట్రాల్లో మాత్రం లోటు వర్షపాతం నమోదైంది. జమ్మూకశ్మీర్, హర్యానా, ఢిల్లీ, మణిపూర్ రాష్ట్రాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షం కురిసింది.