మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు.. ఎక్కడెక్కడ అంటే..
By సుభాష్ Published on 18 Aug 2020 3:27 PM IST
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళ, బుధవారాల్లో రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈశాన్య మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో అల్పపీడనం బలహీనపడింది. కానీ 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితలావర్తనం కొనసాగుతోంది.
ఈశాన్య బంగాళాఖాతంలో 5.8 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్య ఉపరితల అవర్తనం ఏర్పడింది. ఈ కారణంగా ఉత్తర బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. 24 గంటల్లో ఇంకా బలపడి పశ్చిమ దిశగా ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే రాగల మూడు రోజుల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల 48 గంటల్లో ఆదిలాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, ములుగు, వరంగల్ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఎల్లుండి ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.