రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ప్రయాణికులకు ఇది బ్యాడ్ న్యూసే..!
By సుభాష్ Published on 29 Sep 2020 3:18 AM GMTరైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే రైల్వే ప్రయాణికులకు మరింత భారం పడనుంది. అత్యాధునిక సదుపాయాలతో రూపుదిద్దుకుంటున్నపలు రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల నుంచి టికెట్ ధరలపై కనిష్టంగా రూ.10 నుంచి గరిష్టంగా రూ.35 వరకు అదనపు రుసుము వసూలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిని కేంద్ర కేబినెట్‌కు పంపనున్నట్లు సమాచారం. ప్రయాణికులు కొనుగోలు చేసే టికెట్ తరగతిని బట్టి ఈ అదనపు ఛార్జీలను వడ్డించనున్నట్లు తెలుస్తోంది.
ఏసీ ఫస్ట్ క్లాస్ టికెట్‌ఫై రూ.35
ఏసీ ఫస్ట్ క్లాస్ టికెట్‌పై రూ.35 అదనపు రుసుము ఉండే అవకాశం కనిపిస్తోంది. దేశంలో సుమారు ఏడు వేల రైల్వే స్టేషన్లు ఉండగా, అందులో వెయ్యి వరకు స్టేషన్ల నుంచి ప్రయాణించే వారిపై ఈ అదనపు భారం పడనుంది. అయితే గతంలోనే రైల్వేశాఖ ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేసిన, రద్దీ ఎక్కువగా ఉండే స్టేషన్‌లలో అదనపు రుసుము వసూలు చేస్తామని కూడా గతంలో ప్రకటించింది.
దేశంలో అతి పెద్ద వ్యవస్థ అంటే రైల్వే. రైలులో సామాన్యుడు కూడా ప్రయాణించేందుకు తక్కువ ఛార్జీలతో అవకాశం ఉండేది. ఇక ముందు అత్యాధునిక సదుపాయాల పేరుతో అదనపు ఛార్జీలు వడ్డించడంతో సామాన్యుడికి అది మరింత భారంగా మారనుంది. ఒక వేళ ఈ రైల్వే ప్రతిపాదన కేబినెట్‌లో ఆమోదిస్తే రైల్వే ప్రయాణికుల జేబుకు చిల్లు పడినట్లే. మరి సామాన్యుడి సమస్యలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతున్న కేంద్రం.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.