క‌ల‌క‌లం రేపుతున్న 'రాహుల్' ఫారిన్ టూర్.!

By Medi Samrat  Published on  30 Oct 2019 1:21 PM GMT
క‌ల‌క‌లం రేపుతున్న రాహుల్ ఫారిన్ టూర్.!

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మళ్లీ విదేశాలకు వెళ్లారు. ఈసారి వారం రోజుల టూర్ వేశారు. నవంబర్ మొదటి వారంలో మళ్లీ భారత్‌కు తిరిగి వస్తారు. ఐతే, ఆయన ఎక్కడికి వెళ్లింది..? ఎవరెవరిని కలుస్తారు..? అనే అంశాలు బయటకురాలేదు. కాంగ్రెస్ నాయకత్వం కూడా రాహుల్ టూర్‌పై గోప్యంగా వ్యవహరిస్తోంది. రాహుల్ ఫారిన్ టూర్‌ను కన్ఫర్మ్ చేసిన హస్తం నాయకులు, టూర్ వివరాలను మాత్రం వెల్లడించలేదు.

రాహుల్ ఫారిన్ టూర్ కాంగ్రెస్ పార్టీలోనే కలకలం రేపింది. కీలక సమయంలో రాహుల్ మళ్లీ హ్యాండిచ్చారని కాంగ్రెస్ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. దేశ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు సిద్ధమైం ది. ఆర్థికమందగమనంపై నవంబర్ 1 నుంచి 15 వరకు నిరసనలు తెలపాలని నిర్ణయించింది. నవంబర్ 1 నుంచి 8 వరకు 35 ప్రెస్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించనుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా పలువురు సీని యర్ నాయకులు మీడియా ప్రతినిధులతో మాట్లాడనున్నారు. అలాగే, నవంబర్ 5 నుంచి 15 వరకు దేశ ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు వివరించనున్నారు. జిల్లాలు, రాష్ట్ర రాజధానుల్లో నిరసనలు నిర్వహించి, చివరిగా దేశరాజధానిలో భారీ ప్రదర్శనతో ముగిస్తారు. ఈ ప్రదర్శనకు విపక్షాలను కూడా ఆహ్వానించనున్నారు. ఇంతటి కీలకమైన కార్యక్రమాలు ఉండగా, రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది.

ఐతే, కాంగ్రెస్ నాయకత్వం మాత్రం రాహుల్ గాంధీకి అండగా నిలిచింది. నవంబర్ మొదటివారంలో రాహుల్ మళ్లీ భారత్‌కు వచ్చి నిరసనల్లో పాల్గొంటారని తెలిపింది. రాహుల్ గాంధీ అకస్మాత్తుగా విదేశీ పర్యటనకుకు వెళ్లడం ఇదే తొలిసారి కాదు. మహారాష్ట్ర - హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఆయన చెప్పాపెట్టకుండా థాయ్‌లాండ్‌కు వెళ్లారు. గతంలో కూడా 2 నెలల పాటు అదృశ్యమయ్యారు.

Next Story