రాజుగారి కోర్టు ధిక్కారం..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Jan 2020 8:55 AM GMT
రాజుగారి కోర్టు ధిక్కారం..!

సంక్రాంతి సంద‌డి మొద‌లైంది. యుద్ధానికి పందెం కోళ్లు సిద్ధమయ్యాయి. కయ్యానికి కత్తి కట్టి.. కాలు దువ్వుతున్నాయి. పంట పొలాలు యుద్ధ భూమిగా త‌ల‌పించ‌నున్నాయి. కోట్లల్లో డబ్బులు చేతులు మారనున్నాయి. అయితే.. సంక్రాంతి పండుగ వేల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కోడి పందేల హడావుడి మొదలైంది. సంక్రాంతి సంబ‌రాల‌లో పందెం రాయుళ్లకు మాంచి కిక్కిచ్చేవి కోళ్ల పందాలు. ఒక్క గోదావ‌రి జిల్లాల్లోనే సుమారు రూ.1000 కోట్ల‌కు పైగా చేతులు మార‌నున్నాయంటే ఏ రేంజ్‌లో పందాలు జ‌రుగ‌నున్నాయో అర్థం చేసుకోవ‌చ్చు.

ఇక‌, కోడి పందాల‌ను నిర్వ‌హించొద్ద‌ని హైకోర్ట్ వద్దన్నా, పోలీసులు అడ్డుకుంటున్నా పందెం రాయుళ్లు మాత్రం వెన‌క్కి త‌గ్గ‌ట్లేదు. ఎన్ని అడ్డంకులు చెప్పినా పండుగ‌ తర్వాత అంతా మామూలే అన్న ఫీలింగ్‌ అందరిలోనూ ఉంది. దీంతో పందాలు తమ సంస్కృతి, సంప్ర‌దాయం అంటూ నేతలు, ప్రజాప్రతినిధులు సైతం స్వయంగా కోడి పందాలు నిర్వహిస్తుండటం గ‌మ‌నార్హం.

ఇదిలావుంటే.. వైసీపీ నేత‌, న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు సంక్రాంతి సంబ‌రాల‌లో భాగంగా పందెం కోళ్ల‌తో రంగంలోకి దిగారు. కోడిపందేలను సంస్కృతి సంప్రదాయంగా ఆడుకోవచ్చని అన్నారు. హైకోర్టు కోడిపందెలు వ‌ద్ద‌న్నా.. కోర్టు ఆజ్ఞ‌ను దిక్క‌రిస్తూ.. ఓ ప్ర‌జాప్ర‌తినిధి అయ్యుండి పందెలు ఆడ‌టం ప‌ట్ల ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

మరోవైపు.. కోడిపందేలను సంస్కృతి సంప్రదాయంగా ఆడుకోవచ్చుగానీ, అదొక జూదంగా ఆడటం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. సంప్రదాయం ముసుగులో కోడిపందేలను బెట్టింగులతో నిర్వహించకూడ‌ద‌ని అంటున్నారు. ఈ నేఫ‌థ్యంలో పోలీసులు కోడిపండెలు నిర్వ‌హించ‌కుండా ఎటువంటి చ‌ర్య‌లు చేప‌ట్టార‌నేది చ‌ర్చ‌నీయాంశం.

Next Story