డ్రాగన్ జే20తో మన రఫేల్ ఎంతమేర పోటీ పడగలదు?

By సుభాష్  Published on  30 July 2020 6:08 AM GMT
డ్రాగన్ జే20తో మన రఫేల్ ఎంతమేర పోటీ పడగలదు?

గడిచిన నాలుగైదు రోజులుగా ఎక్కడ చూసినా రఫేల్ గురించే చర్చ. మీడియాలోనూ రఫేల్ యుద్ధ విమానాలకు భారీగా కవరేజ్ ఇచ్చేశారు. ఏళ్లకు ఏళ్ల తర్వాత ఇంత భారీ ఎత్తున యుద్ధ విమానాలు దేశానికి రావటం ఇదే తొలిసారి. మొదటగా వచ్చిన ఐదింటికి తోడుగా.. రానున్న రోజుల్లో మరిన్ని యుద్ధ విమానాలు దేశానికి చేరుకోనున్నాయి. రఫేల్ రాకతో భారత వైమానిక దళం మరింత బలోపేతమైందని.. చైనాకు ధీటుగా మన యుద్ధ విమానాలు ఉన్నట్లుగా చెబుతున్నారు.

రఫేల్ ప్రస్తావన వచ్చినంతనే డ్రాగన్ దగ్గర ఉన్న జే20యుద్ధ విమనాల్ని పోలిక తీసుకొస్తుంటారు. మరి.. ఈ రెండింటికి మధ్యనున్న ఫీచర్లను పోల్చి చూస్తే.. ఈ రెండింటిలో ఏది శక్తివంతమైనది? అన్నది ప్రశ్న. మరి.. ఈ రెండు యుద్ధ విమానాలకున్న శక్తిసామర్థ్యాలు.. పరిమితుల్ని చూస్తే.. ఏది తోపే మీకు కూడా అర్థమైపోతుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ రెండింటిని పోల్చేద్దాం.

రఫేల్ వర్సెస్ జే 20

- ఐదో తరం యుద్ధ విమానంగా జే 20కు పేరుంది. కానీ.. దాని ఇంజిన్ మాత్రం మన దగ్గరున్న సుఖోయ్ 30 తరహాకు చెందింది. దీని ఇంజిన్ సామర్థ్యం చాలా తక్కువగా చెబుతారు. ఇదే సమయంలో రఫేల్ విషయానికి వస్తే.. దీని ఇంజిన్ సామర్థ్యం చాలా ఎక్కువ. తన బరువు కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ బరువు మోసే సత్తా దీని సొంతం.

- ఒకే సమయంలో ఇది పలు లక్ష్యాల్ని ఛేదించే సత్తా జే 20 సొంతం. అంతేకాదు.. రాత్రి పగలుఅన్న తేడా లేకుండా దాడులు చేసే సామర్థ్యం దీనికి ఉంది. రఫేల్ విషయానికి వస్తే.. ఒకేసారి ఎనిమిది లక్ష్యాల మీద దాడి చేసేస్తుంది.

- జే20 శక్తి సామర్థ్యాల గురించి వినటమే కానీ చేతల్లో చూసింది లేదు. ఎందుకంటే.. ఈ చైనా యుద్ధ విమానం ఇప్పటివరకూ ఎప్పుడూ కూడా దాడులు చేపట్టలేదు. యుద్ధభూమిలో దీని సత్తా ఏమిటన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. రఫేల్ విషయానికి వస్తే అలాంటి ఇబ్బందేమీ లేదు. ఎందుకంటే.. అఫ్ఘానిస్తాన్.. లిబియా.. సిరియా లాంటి ప్రాంతాల్లో దాడులు జరిపి.. తన సత్తా ఏమిటో ప్రపచానికి చాటిన ఘనత ఉంది.

- జే 20లో సింగిల్ సీటు మాత్రమే ఉంటుంది. రఫేల్ విషయానికి వస్తే సింగిల్ సీటుగానే కాదు.. అవసరమైతే డబుల్ సీటుగా కూడా మార్చుకునే వెసులుబాటు ఉంది. ఈ యుద్ధ విమానాల విషయంలో భారత్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. సింగిల్ సీటు ఉన్న యుద్ధవిమానాలు ఇరవైఎనిమిది భారత్ కు అందిస్తారు. అదే సమయంలో రెండు సీట్లు ఉన్న యుద్ధ విమానాల్ని ఎనిమిదింటికి భారత్ కు అందించనున్నారు.

- జే20 యుద్ధ విమానం బరువు 19వేల కేజీలు. ఇది 37వేల కేజీల బరువున్న ఆయుధాల్ని మోసుకుపోయే సత్తా ఉంది. రఫేల్ విషయానికి వస్తే.. దీని బరువు పదివేల కేజీలు.. కానీ.. 24,500 కేజీల బరువైన సామాన్లను తీసుకెళ్లే సత్తా దీని సొంతం.

- నాన్ స్టాప్ గా 2వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించటమే కాదు.. 59,800 అడుగుల ఎత్తు వరకు ఎగిరే సత్తా జే20 సొంతం. మరి.. రఫేల్ విషయానికి వస్తే.. ఇది జే 20 కంటే కాస్త ఎత్తులో ఎగురగలదు. 60వేల ఎత్తు వరకు ఎగరటమే కాదు.. నాన్ స్టాప్ గా 3700 కిలోమీటర్లు ప్రయాణించే సత్తా దీని సొంతం. మరిప్పుడు.. ఏది తోపో మీకు అర్థమైందా?

Next Story