భారత్‌లో దిగిన రఫేల్‌ యుద్ధ విమానాల ప్రత్యేకతలు ఇవే..

By సుభాష్  Published on  29 July 2020 11:10 AM GMT
భారత్‌లో దిగిన రఫేల్‌ యుద్ధ విమానాల ప్రత్యేకతలు ఇవే..

అత్యంత శక్తివంతమైన రఫేల్‌ యుద్ధ విమానాలు భారత్‌లో దిగాయి. ఫ్రాన్స్‌ నుంచి బయలుదేరిన ఐదు రఫేల్‌ ఫైటర్‌ జెట్స్‌ హర్యానాలోని అంబాలా ఎయిర్‌ బేస్‌లో సురక్షితంగా దిగాయి. ఇండియా గడ్డపై రఫేల్‌ యుద్ధ విమానాలు దిగడంతో మిలటరీ చరిత్రలో నవశకం మొదలైందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ట్వీట్‌ చేశారు.

కాగా, ఈ యుద్ధ విమానాలలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రపంచంలోని అత్యాధునిక ఆయుధాలను ప్రయోగించగల సత్తా ఈ రఫేల్‌కు ఉంది. 9,500 కిలోల ఆయుధాలను మోసుకెళ్లే సత్తా ఉంది. అణు క్షిపణిని ప్రయోగించే సామర్థ్యం ఈ రఫేల్‌ ఫైటర్‌ జెట్లకు ఉంది. రఫేల్‌లో రెండు రకాల క్షిపణులు ఉంటాయి. ఒకదాని సామర్థ్యం 150 కిలోమీటర్లు. రెండో దాని సామర్థ్యం సుమారు 300 కిలోమీటర్లు. అంతేకాదు రఫేల్‌ గాలిలో నుంచి గాలిలో 150 కిలోమీటర్ల దూరం వరకూ క్షిపణిని ప్రయోగించే సత్తా ఉంటుంది. గాలిలో నుంచి భూమిపైకి 300 కిలోమీటర్ల వరకు క్షిపణిని ప్రయోగిస్తుంది. ఇక ఈ యుద్ధ విమానం గంటకు 1389 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. వీటి ఎత్తు 5.30 మీటర్లు, పొడవు 10.30 మీటర్లు. అలాగే ఈ విమానాలు గాలిలోనే ఇంధనం నింపుకోగల సత్తా ఉంటుంది. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన మిరాజ్‌ 2000 జెట్‌ ఫైటర్‌కు ఇది ఆధునిక రూపం.

కాగా, రఫేల్‌ విమానాల్లో సార్‌ రేడార్లు ఉంటాయి. సింథటిక్‌ అపచ్యూర్‌ రేడార్‌ సాధారణంగా జామ్‌ కాదు. లాంగ్‌ రేంజ్‌ టార్గెట్‌లను ఈ రేడార్‌ గుర్తిస్తుంది. రేడార్‌ జామ్‌ కాకుండా ఉండే సదుపాయాలు కూడా ఉన్నాయి. రఫేల్‌లో ఉన్న రేడార్‌ కనీసం వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న శతృ టార్గెట్‌ను గుర్తించగలదు. ఈ యుద్ధ విమానాల్లో ఆధునిక 30ఎంఎం కెనాన్‌ ఆయుధాలు ఉంటాయి. అవి 125 రౌండ్ల కాల్పులు జరపగలవు. ఆకాశం నుంచి నేల‌పై ఉన్న టార్గెట్‌ను స్ట్ర‌యిక్ చేస్తాయి. ల‌డ‌ఖ్ లాంటి ప‌ర్వ‌త ప్రాంతాల్లో ఉన్న బ‌ల‌మైన క‌ట్ట‌డాల‌ను, బంక‌ర్ల‌ను కూడా హ‌మ్మ‌ర్ మిస్సైల్ ధ్వంసం చేయ‌గ‌ల‌దు.

కాగా, ఫ్రాన్స్‌ నుంచి మొత్తం 36 యుద్ధ విమానాలను రూ.58వేల కోట్లకు భారత్‌ ఒప్పందం కుదుర్చుకకున్న విషయం తెలిసిందే. 2021 వరకు మొత్తం యుద్ద విమానాలు భారత్‌కు చేరుకోనున్నాయి. కాగా, చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో రఫేల్‌ యుద్ధ విమానాలు లడఖ్‌ ప్రాంతంలో మోహరించే అవకాశం ఉంది.



Next Story