నిత్య పరీక్ష.. పుష్ప ప్రియా దీక్ష..!
By తోట వంశీ కుమార్ Published on 28 Aug 2020 10:11 AM GMTప్రార్థించే పెదాల కన్నా.. పనిచేసే చేతులు మిన్న.. బెంగళూరుకు చెందిన పుష్పప్రియా దీక్ష జీవితాన్ని దగ్గరుండి చూస్తే.. ఈ వాక్యం నూటికి నూరుపాళ్లు నిజం అనిపిస్తుంది. పుష్ప ప్రీయా గత పదేళ్ళుగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 700 పరీక్షలు రాసింది. ఇంకా రాస్తునే ఉంది. అయితే ఇన్ని పరీక్షలు రాశారు. మాత్రం తన కోసం కాదు. దివ్యాంగుల కోసం తాను పరీక్షలు రాస్తున్నారు. వినడానికి ఇందులో ఏముంది గొప్ప అనిపిస్తుంది గానీ, ఇన్ని పరీక్షలు రాయలంటే సహనం, ఓపికలే కాదు.. సేవాగుణం కూడా ఉండాలంటున్నారు పుష్ప.
సమాజంలో అసహాయులు, దివ్యాంగులు చాలా మందే ఉన్నారు. అయితే యాంత్రిక జీవనంలో పడి కొట్టుకుపోతున్న వారు అంతకన్నా ఎక్కువగానే ఉన్నారు. సాటి వారికి సేవ చేయాలన్నా ఆలోచనే రానివారు ఎందరో! పుష్ప ప్రియా మాత్రం అందరికన్నా భిన్నంగా ఆలోచించారు. సాటి వారికి తనకు చేతనైనంతా సాయం చేయాలని నిశ్చయించుకున్నారు. అక్కడితో ఆగిపోకుండా తన ఆలోచనల్ని కార్యాచరణలో ఉంచారు. ఈ పని చేయడానికి ఎంతో ఓర్పు, త్యాగగుణం ఉండాలంటారు పుష్ప.
పుష్ప సేవలు చేయడానికి సిద్ధమయ్యారంటే.. తనకు జీవితం సాఫీగా సాగిపోతుందని కాదు. దిగువ మధ్య తరగతికి చెందిన పుష్ప కుటుంబం ఎన్నో ఆర్థిక ఒడుదొడుకుల్ని ఎదుర్కొంది. తండ్రి మరణించాక కుటుంబ బాధ్యతలు నెత్తికెత్తుకున్నారు. సంపాయించేది తనొక్కటే కావడంతో బాధ్యత మరింత పెరిగింది. అప్పట్నుంచే స్వార్థపు ఆలోచనల్ని దరి చేరనీయలేదు. కుటుంబం కోసం అహరహం శ్రమించారు. ఓ వైపు కుటుంబ బాధ్యతలు.. మరోవైపు సామాజిక సేవ రెండింటిని సమతూకంతో నిర్వహించడంలో మానసిక ఘర్షణకు లోనయ్యారు. అయితే ఈ ఘర్షణ వల్ల పుష్ప మరింత దృఢంగా మారిందే గానీ సేవాభావాన్ని వదిలేసుకోలేదు. అంతేకాదు ఈ కష్టాల పర్వంలో చదువు విలువేంటో పుష్పకు అర్థం అయింది.
ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకోకపోయే ప్రమాదం పుష్ప జీవితంలో తలెత్తలేదు. ఇంత కష్టంలోనూ తన అదృష్టం చదువుకోవడం ఒక్కటే అని పుష్ప భావన. ' నాకు చిన్నప్పటి నుంచి పరీక్షలంటే చాలా భయంగా ఉండేది. ఇప్పుడు దాదాపు 700 పరీక్షలకు హాజరయ్యాను. చదువుకోవడం ఎంత కష్టమో నాకు బాగా తెలుసు. చాలామంది పరిస్థితుల ప్రభావం వల్లనో, తమ వ్యక్తిగత ఆర్థిక స్థితిగతుల వల్లనో చదువుకోలేక పోతున్నారు. విధి వశాత్తు దివ్యాంగులుగా మారిన వారూ చదవాలంటే చాలా శ్రమించాల్సి వస్తుందని తెలుసు. అందుకే స్క్రైబర్‌గా మారాను. ఎంత మందికి వీలైతే అంతమందికోసం పరీక్షలు రాస్తున్నాను. ఇది నాకు చాలా తృప్తినిస్తోంది.' అంటూ తన అనుభవాలను తెలిపారు పుష్ప ప్రియా.
2007లో సమర్థ అనే స్వచ్చంద సంస్థ కోసం పుష్ప పనిచేయడం ప్రారంబించారు. చూపు లేని వారి కోసం ఈ సేవాసంస్థ పనిచేస్తోంది. అప్పుడే నా స్నేహితురాలు చూపులేని వారికోసం పరీక్షలు రాయవచ్చుగా అన్నప్పడు పుష్పకు ఆ కొత్త ఆలోచన నచ్చింది. వెంటనే అంగీకరించింది. అది మొదలు ఇప్పటి దాకా పరీక్షలు రాస్తునే ఉంటుంది. చూపు లేని వారికి బుర్రలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. అయితే రాయడానికి వారి చేతులు సహకరించవు. అలాంటి వారికి సహాయకారిగా పుష్ప పరీక్షలువ రాసుంటారు.
తను పరీక్షలు రాసే వారిని అయిదు రకాలుగా వర్గీకరించింది పుష్ప. చూపులేనివారు, బుద్ధి మాంద్యం ఉన్నవారు, పాక్షిక పక్షవాతం వచ్చిన వారు, ప్రమాద బాధితులు, కుంగుబాటుతో బాధపడేవారు.. వీరికి సాయం అందించడం కోసమే తను పరీక్షలు రాస్తున్నానని ఆమె వివరించారు. 'సాధారణంగా పరీక్షలంటేనే చాలా మందికి భయం ఉంటుంది. తాము సరిగా రాస్తామో లేదోనన్న ఆందోళన కూడా ఉంటుంది. అలాంటి వారికి సాయం చేయడంలో ఎంతో తృప్తి ఉంది. సామాజిక సేవలందించేందుకు చాలా మార్గాలున్నాయి. ఇలా పరీక్షలు రాయడం కూడా సామాజిక సేవగానే భావిస్తున్నాను. ఎదుటి వారికి సేవ చేయడంతోపాటు పరీక్షలు రాయడం వల్ల విషయ పరిజ్ఞానం పెరుగుతోంది' అంటూ పుష్ప తెలిపారు.
త్వరలో మానసికంగా దెబ్బతిన్న వారికోసం ఓ స్వచ్చంద సేవా సంస్థను ప్రారంభించబోతున్నట్లు పుష్ప పేర్కొన్నారు. అందరిలా పోటీ పడాలని ఉన్న తమ వైకల్యం వల్ల అలా చేయలేకపోయిన వారు బాగా చదువుకోవాలనే ఒక్క కారణంతోనే పరీక్షలు రాస్తున్నట్లు పుష్ప తెలిపారు. వుయ్ హెల్ప్ ఇండియా సహకారంతో తను రక్తదాన శిబిరాలను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
2018 లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారిశక్తి పురస్కారం అందుకున్న పుష్ప ప్రియా తను గత సంవత్సరం దాకా ఐటీ ఉద్యోగంలో బిజీగా ఉండేదాన్నని తెలిపారు. ' జీవించడానికి డబ్బు అవసరమే కానీ జీవితమంటే కేవలం డబ్బే కాదుకదా! మనకోసం మనవాళ్ళ కోసం శ్రమించాల్సిందే కాదనను. కానీ ఎదుటి వారికోసం కూడా మన సమయాన్ని కాస్త ఇవ్వగలిగితే వారు తప్పకుండా ముందుకు వెళతారు. అది మనకెంతో తృప్తి నిస్తుంది. ఎప్పుడూ లాభనష్టాలు బేరీజు వేసుకుంటూ ఉండటానికి జీవితం బ్యాలెన్స్‌షీట్ కాదుకదా! అప్పుడప్పుడు ఇతరుల గురించి ఆలోచించాలి. అదే మానవత్వం' అంటారు పుష్ప.