రెచ్చిపోయిన రాహుల్‌.. ఘోర ప‌రాజ‌యం మూట‌గ‌ట్టుకున్న కోహ్లీ సేన‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Sept 2020 12:02 AM IST
రెచ్చిపోయిన రాహుల్‌.. ఘోర ప‌రాజ‌యం మూట‌గ‌ట్టుకున్న కోహ్లీ సేన‌

రాయల్‌ చాలెంజర్స్ బెంగుళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెలరేగిపోయాడు. మొద‌టి మ్యాచ్‌లో ఫెయిలైన రాహుల్‌.. ఈ మ్యాచ్‌లో మాత్రం రెచ్చిపోయాడు. లయ తప్పిన బంతిని బౌండరీలు దాటించడమే లక్ష్యంగా ఆడాడు. ఈ క్రమంలోనే ఈ ఐపీఎల్‌ తొలి శతకాన్ని న‌మోదు చేశాడు.

రాహుల్‌ ఇచ్చిన రెండు క్యాచ్‌లను ఆర్సీబీ కెప్టెన్ కోహ్లి వదిలేయడంతో.. రాహుల్ వ‌చ్చిన అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకుని శతకబాదాడు. 69 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్‌లతో 132 పరుగులతో అజేయంగా నిలిచాడు. టాస్‌ గెలిచిన ఆర్సీబీ..‌ పంజాబ్ ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మొద‌ట బ్యాటింగ్‌కు దిగిన‌‌ పంజాబ్‌ మూడు వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. రాహుల్‌ కడవరకూ క్రీజ్‌లో ఉండి సెంచరీ సాధించగా.. ఆర్సీబీ బౌలర్లలో దూబేకు రెండు వికెట్లు, చహల్‌కు ఒక‌ వికెట్‌ దక్కాయి.

అనంత‌రం 207 పరుగుల టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన‌ ఆర్సీబీ నాలుగు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆదిలోనే వికెట్లు కోల్పోవడంతో ఆర్సీబీ కష్టాల్లో పడింది. ఏ ద‌శ‌లోనూ కోలుకోని కోహ్లీ సేన‌‌ 17 ఓవర్లలో 109 పరుగులకే పరిమితమైంది. టాపార్డర్‌, మిడిల్‌ ఆర్డర్‌ మొత్తం విఫలం కావడంతో ఆర్సీబీ 97 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. పంజాబ్‌ బౌలర్లలో రవి బిష్నోయ్‌, మురుగన్‌ అశ్విన్‌లు చెరో మూడు వికెట్లు సాధించగా, షెల్డాన్‌ కాట్రెల్‌ రెండు వికెట్లతో మెరిశాడు. ఇక షమీ, మ్యాక్స్‌వెల్‌లు వికెట్‌ చొప్పున తీశారు. ఆర్సీబీ ఆటగాళ్లలో ఫించ్‌(20), డివిలియర్స్‌(28), వాషింగ్టన్‌ సుందర్‌(30) కాసేపు క్రీజులో నిలిచారు.

Next Story