జమ్మూ కశ్మీర్ : పుల్వామాలో మరోసారి భద్రతా దళాలు – ఉగ్రవాదులకు మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో ఒక జవాన్, మరో ఎస్పీఓ మృతి చెందారు. పుల్వామా జిల్లాలోని ఖ్రీవ్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నట్లుగా నిఘా వర్గాలిచ్చిన సమాచారం మేరకు భద్రతా దళాలు ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించాయని ఒక అధికారి వెల్లడించారు. తనిఖీలు చేస్తున్న క్రమంలోనే భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో..ఎన్ కౌంటర్ చేశారని ఆయన వివరించారు. మృతి చెందిన ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరు ఆదిల్ అహ్మద్ గా గుర్తించారు. ఇతను గతంలో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్పీఓ) గా పనిచేసినట్లు వారు తెలిపారు. 2018 సంవత్సరంలో ఆదిల్ వాచ్చి ఎమ్మెల్యే అయిజాజ్ అహ్మద్ ఇంటి నుంచి 7 ఏకే 47 రైఫిళ్లు, ఒక పిస్టల్ తో పారిపోయాడని పేర్కొన్నారు. మిగతా ఇద్దరు ఉగ్రవాదులు వసీం వనీ, జహంగీర్ గా గుర్తించారు. రెండ్రోజుల్లోనే ఇక్కడ రెండు ఎన్ కౌంటర్లు జరగడం కలకలం రేపుతోంది.

రానున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా ఉగ్రవాదులు దాడులు చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారని ఇప్పటికే నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భద్రతను కట్టుదిట్టం చేసే దిశగా కేంద్రం వ్యూహం రచిస్తోంది. ముఖ్యంగా ఢిల్లి, ముంబై, చెన్నై ఇలా అభివృద్ధి చెందిన నగరాలే ఉగ్రవాదుల టార్గెట్ అని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.