అచ్చం పుల్వామా అటాక్ లాగే ప్లాన్ చేశారు..!

By సుభాష్  Published on  28 May 2020 10:26 AM IST
అచ్చం పుల్వామా అటాక్ లాగే ప్లాన్ చేశారు..!

శ్రీనగర్: పుల్వామా ఉగ్రదాడిని భారతదేశం ఎప్పటికీ మరచిపోదు. ఈ ఘటన తర్వాత తీవ్ర వాదులపై భారత్ ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా భారత సెక్యూరిటీ ఫోర్స్ పుల్వామా అటాక్ లాంటి మరో ఉగ్రదాడిని ఆపగలిగారు. పుల్వామా జిల్లాలో 20 కేజీల ఇంప్రొవైజ్డ్ ఎక్సప్లోజివ్ డివైస్(ఐఈడి)లతో వెళుతున్న కారును అధికారులు పట్టుకున్నారు.

పేలుడు పదార్థాలను తీసుకుని వెళుతున్న కారు తప్పుడు రిజిస్ట్రేషన్ తో ఉందని పోలీసులు గుర్తించారు. పోలీసుల బ్యారికేడ్ ను చూసి వేగంగా వెళ్లాలని ప్రయత్నించాడు. కానీ వీలు పడలేదు. కారు వేగంగా వస్తున్నదాన్ని చూసి సెక్యూరిటీ అధికారులు కారుపై కాల్పులను జరిపారు. వెంటనే కారును అక్కడే నిలిపేసిన డ్రైవర్ పారిపోయాడు. తీరా కారులో చూడగా.. 20 కేజీల పేలుడు పదార్థాలు కనిపించాయి. ఈ ఘటనపై తమకు ఇంటెలిజెన్స్ నుండి సమాచారం అందిందని ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. నిన్నటి నుండి వాహనం కోసం వెతుకుతూనే ఉన్నామని తెలిపారు.

పేలుడు పదార్థాలను కారు నుండి బయటకు తీసి.. బాంబ్ స్క్వాడ్ పేల్చివేసిందని తెలిపారు. పోలీసులు, భారత ఆర్మీ, పారామిలిటరీ కలిసి ఈ ఆపరేషన్ ను పూర్తీ చేశాయని అధికారులు స్పష్టం చేశారు.

గత ఏడాది ఫిబ్రవరి నెలలో పుల్వామా జిల్లాలో ఇదే తరహాలో బాంబు దాడి జరిగిన సంగతి భారతీయులు ఎవరూ మరచిపోలేదు. 40 మంది సీఆర్పీఎఫ్ జవానులు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన తర్వాత భారత ఎయిర్ ఫోర్స్ జైషే మొహమ్మద్ క్యాంపుపై దాడి చేసింది.. దాదాపు 300 మంది తీవ్రవాదులు హతమయ్యారని తెలిపారు. గత రెండు నెలలుగా జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడులు ఎక్కువయ్యాయి. 30 మంది భారత సెక్యూరిటీ అధికారులు ప్రాణాలు కోల్పోగా.. 38 మంది తీవ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. హిజ్బుల్ ముజాహిద్దీన్ కు చెందిన మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది రియాజ్ నైకూ ను భారత సైన్యం చంపేసింది. దేశం ఓ వైపు కరోనా వైరస్ పై పోరాడుతూ ఉంటే.. ఇదే అదనుగా పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్ లో మారణహోమం సృష్టించాలని ప్రయత్నిస్తూ ఉన్నారు.

Next Story