పబ్జీ గేమ్‌కు బానిసైన యువకుడు.. గుండెపోటుతో మృతి
By సుభాష్
నేటి కాలంలో యువత మొబైల్ ఫోన్లకు బానిసగా మారిపోతున్నారు. ఫోన్ల వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. ఈ మధ్యన పబ్జీ గేమ్ కు ఎందరో యువత బానిసలుగా మారిపోతున్నారు. ఈ గేమ్ కారణంగా ఇప్పటి వరకు చాలా మందే ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలున్నాయి. ఈ గేమ్ వల్ల చాలా మంది బానిసలుగా మారిపోతున్నాయి. తాజాగా ఈ పబ్జీగేమ్‌కు బానిసగా మారిన ఓ యువకుడు చివరకు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మహారాష్ట్రలోని పుణేకు చెందిన హర్షల్ (27) అనే యువకుడు రెండు సంవత్సరాలుగా పబ్జీగేమ్‌కు బానిసగా మారాడు. ఏ పనిపాట లేకుండా ప్రతి రోజు పబ్జీగేమ్‌లో మునిగి తేలిపోయాడు. పబ్జీగేమ్‌కు బానిసగా మారిన ఆ యువకున్ని ఇటీవల తల్లిదండ్రులు మందలించారు. అయినా.. వినకుండా పబ్జీ పిచ్చి పట్టించుకున్నాడు.
ఈ నేపథ్యంలో యువకుడు గేమ్ ఆడుతుండగా, గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతి చెందాడు. హర్షల్‌కు గుండెపోటుతో పాటు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని వైద్యులు తెలిపారు. మెదడులో నరాలు చిట్లిపోయాయని, లోపల రక్తస్రావం కావడంతో యువకుడు చనిపోయినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఎక్కువ సేపు మొబైల్ వాడటం, గేమ్స్ ఆడటం వల్ల మెదడులోని నరాలు దెబ్బతింటాయని వైద్యులు తెలిపారు. పబ్జీగేమ్ లాంటివి ఎక్కువ ఆడటం వల్ల దాని ప్రభావం మెదడుపై పడుతుందంటున్నారు. యువత మొబైల్ ఫోన్లకు వీలైనంత వరకు దూరంగా ఉంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.