ఫ్రాన్స్‌లో కార్మికుల సమ్మె ఉద్రిక్తం..!
By అంజి
ముఖ్యాంశాలు
- పెన్షన్ పై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఫ్రాన్స్‌లో నిరసనలు
- ప్లకార్డులు, బ్యానర్లు తో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
- పెన్షన్ మంజూరులో ప్రభుత్వ సంస్కరణలు
పారిస్: పెన్షన్ పై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఫ్రాన్స్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి. తమ విధులను బహిష్కరించిన ఉద్యోగులు, కార్మికులు మరోసారి కదం తొక్కారు. సమ్మెలో పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రన్ బైజాంటీన్ తరహా పెన్షన్ విధానాన్ని తీసుకురానున్నట్టు ప్రకటించారు. ఈ విధానం ద్వారా అన్ని వర్గాల కార్మికులకు, ఉద్యోగులకు ఒకేరకమైన పెన్షన్ అందనుంది. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగులు నిరసనలు చేపట్టారు. ప్లకార్డులు, బ్యానర్లు తో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.రెండు వారాల నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. క్రిస్మస్ పండుగ లోపు నూతన పెన్షన్ విధానాన్ని అమల్లోకి తెస్తామంటూ మాక్రన్ చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్లపై టైర్లు దగ్ధం చేశారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పలు ప్రాంతాల్లో రైల్వే, మెట్రో స్టేషన్ కార్మికులు సైతం విధుల నుంచి బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు.
పెన్షన్ మంజూరులో ప్రభుత్వ సంస్కరణల కారణంగా తక్కువ పెన్షన్ స్వీకరించి ఎక్కువ కాలం పనిచేయాల్సిన దుస్థితి ఏర్పడుతుందని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. నూతన పెన్షన్ విధానం ద్వారా కార్మికులు, ఉద్యోగుల పనిగంటలు పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ సమ్మెలో ఉపాధ్యాయులు, లాయర్లు, ఆరోగ్యశాఖ సిబ్బంది, రవాణా రంగం కార్మికులు, ఎయిర్‌పోర్ట్ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. సమ్మె నేపథ్యంలో విద్యాసంస్థలు స్వచ్చంధంగా సెలవు ప్రకటించాయి. వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. నిరసనలు ఉదృతమవడంతో నిరసనకారులపై భద్రతా బలగాలు లాఠీలు ఝళిపించాయి. బాష్పవాయుగోళాలు ప్రయోగిం చాయి. ఈ ఘటనలో పలువురు నిరసనకారులు గాయపడ్డారు.
ఫ్రాన్స్‌లో కార్మికులు, ఉద్యోగుల పెన్షన్ విధానంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టాలని మాక్రన్ ఆలోచన కొత్తది కాదు.1995లోనూ నాటి అధ్యక్షుడు జాకస్ చిరాక్ కూడా పెన్షన్ విధానంలో సంస్కరణల కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. అప్పట్లో కూడా ప్రజాందోళనలు ఉధృతం కావడంతో ఆయన వెనక్కి తగ్గారు.ప్రస్తుతం ఫ్రాన్స్ లో 40 రకాల పెన్షన్లు అమల్లో ఉన్నాయి. వీటన్నింటి బదులుగా సారూప్యమైన పెన్షన్ విధానం తీసుకురావాలన్నది మాక్రన్ ఆలోచన.