సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బోబ్డే నియామకం కానున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నవంబర్ 17న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో జస్టిస్ బోబ్డే బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు నూతన సీజేగా జస్టిస్ బోబ్డే పేరును ప్రతిపాదిస్తూ కేంద్ర న్యాయశాఖకు జస్టిస్ గొగోయ్ లేఖ రాశారు. నియా మకానికి సంబంధించిన పత్రాలు కూడా సిద్దం చేసినట్లు సమాచారం. నవంబర్ 18న సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బోబ్డే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2021 ఏప్రిల్ 23న జస్టిస్ బోబ్డే పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది.

జస్టిస్ బోబ్డే పూర్తి పేరు శరద్ అరవింద్ బోబ్డే. 1956 ఏప్రిల్‌ 24న మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన న్యాయవాద కుటుంబంలో బోబ్డే జన్మించారు. నాగ్‌పూర్‌ యూనివర్సిటీకి చెందిన ఎస్‌ఎఫ్‌ఎస్‌ కాలేజీలో న్యాయ విద్యనభ్యసించారు. 1978లో అడ్వకేట్‌గా తనపేరు నమోదు చేసుకున్నారు. బాంబే హైకోర్టు నాగ్‌పూర్‌ బెంచీలో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 1998లో సీనియర్ అడ్వకేట్ అయ్యారు. 2000లో బోంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2012లో మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టారు. 2013 ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టులో ఆరేళ్లు గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

జస్టిస్ బోబ్డే ఎన్నో కీలక కేసుల్లో సంచలన తీర్పులు వెలువరించారు. ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డు తప్పనిసరి చేయడాన్ని జస్టిస్ బాబ్డే, జస్టిస్ నాగప్పన్, జస్టిస్ చలమేశ్వర్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. ఆధార్ కార్డు లేనంత మాత్రాన ఏ పౌరుడికీ ప్రభుత్వం పథకాలు దూరం చేయరాదని స్పష్టం చేసింది. అబార్షన్‌కు వ్యతిరేకంగా జస్టిస్ బోబ్డే స్పష్టమైన ఆదేశాలిచ్చారు. 26 వారాల గర్భాన్ని తొలగించుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ 2017లో ఓ మహిళ పెట్టుకున్న పిటిషన్‌ను జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం తిరస్కరించింది. పర్యావరణ పరిరక్షణకూ జస్టిస్ బోబ్డే తనవంతు సాయం అందించారు. కాలుష్యం పెరిగిపోతున్నందున ఢిల్లీలో బాణాసంచా అమ్మకాలను నిషేధించారు. దశాబ్దాల అయోధ్య వివాదంపై విచారణ జరిపిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో కూడా జస్టిస్ బోబ్డే ఉన్నారు. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించడంతో పాటు మహారాష్ట్ర నేషనల్‌ లా యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌గా కూడా జస్టిస్ బోబ్డే సేవలందించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.