ఓయూ ప్రొఫెసర్ ఖాసిం అరెస్ట్ - మావోయిస్టులతో సంబంధాలు.?

By అంజి  Published on  23 Jan 2020 7:57 AM GMT
ఓయూ ప్రొఫెసర్ ఖాసిం అరెస్ట్ - మావోయిస్టులతో సంబంధాలు.?

ముఖ్యాంశాలు

  • ఉస్మానియా వర్సిటీ అసెస్టెంట్ ప్రొఫెసర్ ఖాసిం అరెస్ట్
  • రిమాండ్ రిపోర్ట్ లో పలు కీలకమైన విషయాలు
  • విద్యావేత్త ముసుగులో మావోయిస్ట్ పార్టీ కార్యకలాపాలు
  • ఖాసింకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని అభియోగం
  • విచారణలో ఈ విషయాన్ని ఒప్పుకున్నట్టుగా సమాచారం
  • ఖాసిం ఇంటి నుంచి పలు కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం
  • సీజ్ చేసిన డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించిన పోలీసులు
  • తవ్వినకొద్దీ వెలుగు చూస్తున్న విస్మయం గొలిపే విషయాలు

నోబెల్ ప్రైజ్ విన్నర్ అభిజీత్ బెనర్జీ వర్క్స్ తో సహా పలు కీలకమైన డాక్యుమెంట్లను దేశ భద్రతకు విఘాతం కలిగించేందుకు దురుపయోగం చేశాడంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఖాసింపై తెలంగాణ పోలీసులు అభియోగాలు మోపి అరెస్ట్ చేశారు.

అభిజీత్ రాసిన సైన్స్ – హేతువాదం అనే పేపర్ తోపాటుగా, మనిషి మార్క్సిజం, ది జర్నీ ఆఫ్ జర్నలిస్ట్స్, బహుజన కెరటాలు, మార్క్సిజమ్ కి, లెనినిజమ్ కి, మావోయిజంకి సంబంధించిన అనేక కీలకపత్రాలను ఖాసిం దగ్గర స్వాధీనం చేసుకున్న పోలీసులు మావోయిస్టులతో ఖాసింకి బలమైన సంబంధాలు ఉన్నాయని నిరూపించేందుకు వాటిని ఆధారాలుగా చూపుతున్నారు.

సోదాల్లో తెలంగాణ పోలీసులకు భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్రకమిటీకి సంబంధించిన, పి.ఎల్.జి.ఎ ఆరవ ఆవిర్భావ దినాన్ని వారం రోజులపాటు సమరోత్సవంతో ఘనంగా జరపండి అని రాసి ముద్రించి ఉన్న పాంప్లేట్, వాటితో పాటుగా మరో వంద మార్క్సిజమ్, లెనినిజం, మావోయిజం భావనలకు సంబంధించిన పుస్తకాలు ఖాసిం నివాసంలో దొరికాయి.

అలాగే భీమా కోరేగావ్ కేసుకి సంబంధించిన వార్తలు ఉన్న పేపర్ క్లిప్పింగ్స్, ఆ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులతో ఖాసిం సంప్రదింపులు జరిపినట్టుగా రుజువుచేసే కొన్ని కాగితాలు, ఆధారాలుకూడా లభించినట్టు సమాచారం. రష్యన్ లిటరలీ జైంట్ రాసిన వార్ అండ్ పీస్ పుస్తకంకూడా ఖాసిం దగ్గర ఉన్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు నిషేధించిన ఆ పుస్తకాన్ని ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ఖాసింపై విచారణలో ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా తెలుస్తోంది.

రిమాండ్ డైరీ ప్రకారం ఖాసింపై ఉద్దేశపూర్వకమైన కుట్ర, నిషేధింపబడిన విప్లవ పత్రాలు, పుస్తకాలను కలిగి ఉండడం, సిపిఐ మావోయిస్టులకు సహాయ సహకారాలు అందించడం, వారితో సంబంధాలు కలిగి ఉండడం అనే నేరాలపై కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది.

అభిజీత్ బెనర్జీ రాసిన సైన్స్ అండ్ రెవల్యూషన్, ది జర్నీ ఆఫ్ ది జర్నలిస్ట్స్ లాంటి పుస్తకాలు పత్రాలను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించేందుకే ఖాసిం తన ఇంటిలో పెట్టుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఖాసిం ఇంటినుంచి సీజ్ చేసిన కీలకమైన పత్రాలను పోలీసులు కోర్డుకు సమర్పించారు. ఈ కేసుకు సంబంధించి సీజ్ చేసిన ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ని కోర్ట్ ఆదేశాల మేరకు పరిశీలనకోసం ఎఫ్.సి.ఎల్ కి పంపినట్టుగా తెలుస్తోంది.

నలుగురు మాజీ మావోయిస్టులు..

రిమాండ్ డైరీ వివరాల ప్రకారం 2016 అన్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ కేసు ఖాసింపై నమోదైనట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో పోలీసులు 54 మందిని నిందితులుగా పేర్కొన్నట్టు సమాచారం. ఖాసింను అక్యూజ్డ్ నెంబర్ 2గా, ఆయన భార్య స్నేహలతను అక్యూజ్డ్ నెంబర్ 3గా పేర్కొనడం జరిగిందని అధికారులు చెబుతున్నారు.

నలుగురు మాజీ మావోయిస్టులను ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులుగా పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఖాసిం తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన భావజాలాన్ని విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తూ, ఆ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ తరఫున పనిచేస్తున్నారనీ, రక్షణకోసం తన వృత్తిని అడ్డుగా పెట్టుకున్నారని పోలీసులు చెబుతున్నారు.

తనకు మావోయిస్ట్ పార్టీ టాప్ కేడర్ నేతలతో దగ్గరి పరిచయాలు ఉన్నట్టుగా ఖాసిం విచారణలో అంగీకరించినట్టుగా రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. అది మాత్రమే కాక తెలంగాణ పేరుతో ఖాసిం తనే ఎడిటర్ గా ఉండి ఒక మాస పత్రికనుకూడా నడుపుతున్నారు.

దీనికి మావోయిస్ట్ పార్టీ నిధుల్ని సమకూరుస్తోందనీ, ఖర్చులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఖాసిం మావోయిస్ట్ నేతలకు అందజేస్తున్నారనీ, ఆయన విరసం సంస్థనుకూడా ముందుండి నడుపుతున్నారనీ రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టం చేయడం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.

ఖాసిం నేతృత్వం వహిస్తున్న బృందంలోని 19మంది కీలకమైన సభ్యుల వివరాలనుకూడా పోలీసులు కోర్టుకు నివేదించారు. వాళ్లంతా స్థానిక వ్యాపారులు, కాంట్రాక్టర్ల దగ్గర బెదిరింపులకు పాల్పడి మావోయిస్ట్ పార్టీకోసం నిధులు సేకరిస్తున్నారనీ పోలీసులు అత్యంత కీలకమైన సమాచారాన్ని సేకరించారు. ఈ బృందంలో విద్యార్థులు, మహిళలు, రైతులు, టీచర్లు, సామాజిక కార్యకర్తలు, మానవ హక్కుల కార్యకర్తలు ఉన్న విషయాన్ని పక్కా ఆధారాలతోసహా పోలీసులు గుర్తించినట్టు సమాచారం.

ఇలా సేకరించిన నిధుల్ని మావోయిస్టులు ఆయుధాలకొనుగోలుకు, ల్యాండ్ మైన్స్ ని తయారు చేయడానికి వినియోగిస్తున్న విషయం విచారణలో వెల్లడయ్యిందనీ, ఆ విషయాన్ని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగిందనీ పోలీసులు చెబుతున్నారు. ఇంకా ఈ గ్రూపుతో సంబంధం ఉన్న అనేకమంది కీలకమైన వ్యక్తుల వివరాలనుకూడా సేకరించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Next Story