సాధార‌ణంగా సినిమావాళ్లు సున్నిత‌మైన అంశాల‌పైన మాట్లాడేందుకు కాస్త ఆలోచిస్తుంటారు. అందులోను వివిధ ప్రాంతాల‌కు సంబంధించిన వ్య‌వ‌హారాల‌పై మాట్లాడేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా ఉంటారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో కూడా సినిమా ప‌రిశ్ర‌మ‌కు చెందిన చాలా మంది ప్ర‌ముఖులు అటు తెలంగాణ వైపుకానీ, ఇటు ఆంధ్రావైకానీ మొగ్గు చూప‌కుండా త‌ట‌స్థంగా ఉంటూ సంయ‌మ‌నం పాటించారు. అన్ని ప్రాంతాల్లోనూ సినిమాలు చూసేవారు.. అభిమానులు ఉంటారు క‌నుక ఎవ‌రి మ‌న‌సు నొచ్చుకోకూడ‌దు ఉద్దేశంతో వీలైనంత వ‌ర‌కు సినీ ప్ర‌ముఖులు ఇలాంటి సున్నిత‌మైన అంశాల్లో త‌ట‌స్థంగా ఉంటూ వ‌స్తారు.

ఇప్పుడు ఏపీ రాజ‌ధానుల అంశంలో కూడా చాలా వ‌ర‌కు సినీ ప్ర‌ముఖులంద‌రూ మౌనంగానే ఉంటున్నారు. కానీ, మెగాస్టార్ చిరంజీవి మాత్రం త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తూ అభివృద్ధి అన్న‌ది అన్ని ప్రాంతాల‌కు ఉండాలి క‌నుక, మూడు ప్రాంతాల‌కు అభివృద్ధి ద‌క్కాలి కాబ‌ట్టి మూడు రాజ‌ధానుల ఆలోచ‌న అయితే మంచిది, దాన్ని తాను స్వాగ‌తిస్తున్నానంటూ చిరంజీవి ఆ మ‌ధ్య ఒక ప్ర‌క‌ట‌న చేశాడు.

అయితే, చిరంజీవి ప్ర‌క‌ట‌న‌ను సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారెవ్వ‌రు త‌ప్పుప‌ట్ట‌లేదు కానీ.. ఒక్క అశ్వ‌నీద‌త్ మాత్రం చిరంజీవిపైన చాలా సీరియ‌స్‌గా స్పందించారు. అస‌లు చిరంజీవికి ఏం తెలుసు అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అమ‌రావ‌తికి మ‌ద్ద‌తు ఇవ్వ‌ని హీరోల సినిమాలు చూడొద్దంటూ కూడా పిలుపునిచ్చారు. అస‌లు అశ్వ‌నీద‌త్ ఈ అంశానికి ఇంత సీరియ‌స్‌గా ఎందుకు స్పందించారు..? ఏకంగా చిరంజీవిపైన కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేయాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది..? అమ‌రావ‌తికి మ‌ద్ద‌తు ఇవ్వ‌కుంటే హీరోల సినిమాలు చూడొద్దు అని పిలుపునివ్వాల్సిన అవ‌స‌రం. ఆయ‌న‌కెందుకు అంత తాప‌త్ర‌యం ఉంది అన్న‌దానిపైన పెద్ద చ‌ర్చే జ‌రిగింది.

అయితే, అశ్వ‌నీద‌త్‌కు కూడా అమ‌రావ‌తిలో భూములు ఉన్నాయి. ఆ భూముల విలువ ప‌డిపోతుంద‌న్న ఉద్దేశంతోనే అశ్వ‌నీద‌త్ ఇలా మాట్లాడుతున్నారన్న‌ది ఇప్పుడు కొత్త‌గా వెలుగులోకి వ‌స్తున్న అంశం. నిజానికి తొలుత అమరావ‌తి ప్రాంతంలో అశ్వ‌నీద‌త్‌కు భూమి లేదు. గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టు ద‌గ్గ‌ర 40 ఎక‌రాలు ఉండేది. గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టును విస్త‌రించాలి అని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అప్ప‌ట్లో అనుకున్న‌ప్పుడు.. గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టు విస్త‌ర‌ణ‌కు ఆ 40 ఎక‌రాల భూమిని అప్ప‌గించిన అశ్వ‌నీద‌త్ అందుకు ప్ర‌తిఫ‌లంగా అమ‌రావ‌తిలో భూమి తీసుకున్నారు. ఒక్కో ఎక‌రాకు 1450 చ‌.గ‌జాలు చొప్పున అశ్వ‌నీద‌త్ తీసుకున్నారు. ఇదంతా 2015 జూన్‌లో జ‌రిగింది.

డ్రీమ్ నెర‌వేర‌దేమోనన్న ఆక్రోశం..

అలా గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టు ద‌గ్గ‌ర ఇచ్చిన భూమికి ప్ర‌తిఫ‌లంగా అమ‌రావ‌తి ప్రాంతంలో 12 ఎక‌రాల భూమిని అశ్వ‌నీద‌త్ గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నుండి తీసుకున్నారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కూడా అశ్వ‌నీద‌త్‌కు అమ‌రావ‌తి ప్రాంతంలో 12 ఎక‌రాల‌ను అప్ప‌గించింది. ఈ 12 ఎక‌రాల‌ను ఏం చేయాలి అన్న‌దానిపైన అశ్వ‌నీద‌త్‌కు ఒక పెద్ద డ్రీమ్ ఉండేది. ఆ మ‌ధ్య ఒక ప్ర‌ముఖ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఈ అంశాన్ని ప్ర‌స్తావించారు. 2019 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు టీడీపీ త‌రుపున తాను ప్ర‌చారం చేస్తాన‌ని చెప్పిన అశ్వ‌నీద‌త్ ఆ త‌రువాత అమ‌రావ‌తిలో ఉన్న త‌న భూముల్లో ఒక పెద్ద మ‌ల్టీఫ్లెక్స్ క‌ట్టాలి. పెద్ద క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ క‌ట్టి, ఒక హోట‌ల్‌క‌ట్టి వాటిని చూసుకుంటూ అక్క‌డే ఎంజాయ్ చేయాల‌న్న‌ది త‌న ఆశ‌య‌మ‌న్న‌ది కూడా అశ్వ‌నీద‌త్ చెప్పారు.

ప్ర‌స్తుతం సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణలో భాగంగా మూడు రాజ‌ధానుల‌ను ఏర్పాటుచేస్తే అమ‌రావ‌తి ప్రాంతంలో భూముల ధ‌ర‌లు కొద్దిగా త‌గ్గొచ్చు. అలా భూముల ధ‌ర‌లు త‌గ్గితే అశ్వ‌నీద‌త్‌కు చెందిన 12 ఎక‌రాల భూమిపైన కూడా ప్ర‌భావం ఉంటుంది. క‌నుక ఇలా మూడు రాజ‌ధానులు పెట్ట‌డం వ‌ల్ల అమ‌రావ‌తి ప్రాంతంలో ఉన్న త‌న భూమి విలువ కూడా ప‌డిపోతుంది త‌న డ్రీమ్ కూడా నెర‌వేర‌దేమో అన్న ఆక్రోశంతో అశ్వ‌నీద‌త్ మాట్లాడిన‌ట్టుగా ఉంద‌ని చాలా మంది విమ‌ర్శిస్తున్నారు. అదంతా అమ‌రావ‌తి మీద ప్రేమ కాదు.. అశ్వ‌నీద‌త్‌కు కూడా అమ‌రావ‌తిలో 12 ఎక‌రాల భూమి ఉంది. ఆ భూమి కోస‌మే అశ్వ‌నీద‌త్ ఇలా చిరంజీవిపైన, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపైన చిందులు వేస్తున్నార‌న్న‌ది వైసీపీ నుంచి వ‌స్తున్న ఆరోప‌ణ‌.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.