రాత్రి 8గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ

By Newsmeter.Network  Published on  24 March 2020 7:09 AM GMT
రాత్రి 8గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ

కరోనా వైరస్‌ భారత్‌లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం వైరస్‌ వ్యాప్తిచెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి 8గంటల సమయంలో మోది జాతినుద్దేశించిన ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని ప్రధాని తన ట్విటర్‌లో ద్వారా వెల్లడించారు.

దేశంలో విస్తరిస్తున్న కరోనా వ్యాప్తిని అడ్డుకొనేందుకు ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజలు గుంపులు గుంపులు ఉండటం ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని భావించిన కేంద్రం ఆదివారం జనతా కర్ఫ్యూను విధించింది. ప్రధాని పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రజలు జనతా కర్ఫ్యూలో పాల్గొని ఇండ్లకే పరిమితమయ్యారు. అదేరోజు సాయంత్రం దేశవ్యాప్తంగా 80 జిల్లాల్లో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉందని భావించిన కేంద్రం.. ఆ జిల్లాల్లో లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీనికితోడు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. కాగా సోమవారం ప్రజలు లాక్‌డౌన్‌ను పట్టించుకోకుండా రోడ్లపైకి వచ్చారు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు.

లాక్‌డౌన్‌ విధించింది మనం మనల్నిరక్షించుకొనేందుకేనని ప్రధాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా ఇండ్లకే పరిమితం కావాలని, అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని ప్రధాని కోరారు. తద్వారా వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని సూచించారు. ప్రధాని ట్వీట్‌తో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. సోమవారం మధ్యాహ్నం నుంచి రోడ్లపైకి వచ్చిన వారందరిని ఇండ్లకే పరిమితం కావాలని సూచించారు. మాట వినని వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. తాజాగా దేశంలో 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పూర్తిగా లాక్‌డౌన్‌లో ఉన్నాయి. ఇన్ని చర్యలు చేపట్టినా కరోనా పాజిటివ్‌ కేసులు దేశవ్యాప్తంగా 500 కు చేరువయ్యాయి. తొమ్మిది మంది మృతి చెందారు. దీంతో ప్రధాని సాయంత్రం 8గంటల సమయంలో జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. తన ప్రసంగంలో మరిన్ని కఠిన నిర్ణయాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ప్రధాని తన ప్రసంగంలో ఎలాంటి నిర్ణయాలు వెల్లడిస్తారోనని దేశవ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Next Story