ఆ నినాదాల మూలంగానే తమ ప్రభుత్వం పనిచేస్తోంది.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
By అంజి Published on 29 Feb 2020 3:42 PM IST
ప్రయాగ్‌రాజ్: ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రయోజనాలను ప్రతి వ్యక్తి అందుకుని, ప్రతి పౌరుడు సుఖ సంతోషాలతో జీవించాలన్నదే తమ ప్రభుత్వ అభిమతమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ.. ఉత్తరప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. శనివారం ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన సామాజిక అధికారితా శిబిర్‌లో ఆయన పాల్గొన్నారు.
గత ప్రభుత్వాలేవీ పనిచేయనంతగా.. ప్రజల కోసం తమ ప్రభుత్వం పని చేస్తోందని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. సబ్ కా సాథ్.. సబ్ కా వికాసన్ అన్న నినాదాన్ని మరో పునరుద్ఘాటించారు. వీటిని ములంగా చేసుకునే తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. దేశంలో ప్రతి వ్యక్తికీ కనీస ప్రయోజనాలు కల్పించడం ప్రభుత్వం కనీస బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. సమావేశ ప్రారంభానికి ముందు దివ్యాంగులకు ప్రధాని మోదీ అవసరమైన పరికరాలను బహుకరించారు.
దేశంలోని ప్రజలందరికీ సేవ చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. దివ్యాంగుల గురించి గత ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం దివ్యాంగుల సమస్యలను గుర్తించి వాటి పరిష్కార దిశగా ముందుకు సాగుతోందన్నారు. గడిచిన ఐదేళ్లలో దివ్యాంగులకు చేయూతనివ్వడానికి దేశవ్యాప్తంగా 9 వేల క్యాంప్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. రూ.900 కోట్ల విలువ చేసే వస్తువులను పంపిణీ చేశామన్నారు.
దివ్యాంగుల కోసం నిధులను కూడా విడుదల చేశామన్నారు. అలాగే ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు. అంతకుముంద దివ్యాంగులు, వృద్ధులతో మోదీ మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 26,874 మంది పాల్గొన్నారు. కాగా 55,406 ఉపకరణాలను పంపిణీ చేశారు.