కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో ఆందోళనలను ఆపకపోతే రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుందని బీజేపీ వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో నెలకొన్న హింసకు కారణం సీఎం మమతా బెనర్జీ మైనార్జీ బుజ్జగింపు రాజకీయాలేనని బీజేపీ జాతీయ కార్యదర్శి రాహుల్‌ సిన్హా అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న విధ్వంసానికి మమతా బెనర్జీనే బాధ్యత వహించాలని రాహుల్‌ సిన్హా అన్నారు. ఆందోళనలను అదుపులోకి తేవడానికి టీఎంసీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని రాహుల్‌ సిన్హా విమర్శించారు. బంగ్లాదేశ్‌ నుంచి రాష్ట్రంలోకి వలస వచ్చినవారే ఈ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారని బీజేపీ నేత రాహుల్‌ సిన్హా ఆరోపించారు.

పశ్చిమబెంగాల్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ముర్షీబాద్‌లో నిరసనకారులు ఐదు రైళ్లకు నిప్పుపెట్టి హింసకు పాల్పడ్డారు. బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తులు పెద్ద మొత్తంలో నిరసకారులు ధ్వంసం చేశారు. వందల కోట్ల విలువైన వాటిని ఆందోళనకారులు నాశనం చేశారని అక్కడి ప్రభుత్వ వర్గాలు పెర్కొన్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. అందరూ సంయమనం పాటించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో నెలకొన్న అశాంతి పట్లు గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈస్టర్న్‌ రైల్వే దాదాపు 80 రైళ్లను రద్దు చేసింది.

ఈశాన్య రాష్ట్రాల్లో క్యాబ్‌పై నాలుగు రోజులుగా అట్టుడికిపోతోంది. పలు చోట్ల కర్ఫ్యూను విధించగా.. అసోంలో ఇంటర్నెట్‌ సేవలపై నిషేధం విధించారు. దక్షిణ భారత దేశంలో కూడా పలు చోట్ల పౌరసత్వ సవరణకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. నిరసనల కారణంగా ఢిల్లీలోని జామియా యూనివర్సిటీకి జనవరి 5వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. దక్షిణ మధ్య రైల్వే నుండి పశ్చిమ బెంగాల్‌కు వెళ్లే రెండు రైళ్లను రద్దు చేశారు. కొంకణ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై వాహనల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. బస్సులకు నిప్పు పెట్టి తగల బెట్టారు. మరోవైపు పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.