గర్భవతులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయమిది.. ఎందుకంటే..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 April 2020 3:04 PM GMTఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెరిక్ గైనకాలజిక్ సొసైటీ ఆఫ్ ఇండియా(FOGSI) నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మహిళలకు చిన్న సలహా ఇస్తున్నారు. వీలైతే ప్రెగ్నెన్సీ ని కొన్ని రోజుల పాటూ పోస్ట్ పోన్ చేసుకోవాలని.. కరోనా మహమ్మారి తగ్గే వరకూ జాగ్రత్త పడితే బాగుంటుందని సూచిస్తున్నారు. డాక్టర్ టి.రమణి దేవి ఈ సూచనలు చేస్తున్నారు.
మహిళలపై కరోనా మహమ్మారి ప్రభావం తక్కువగా చూపిస్తోందని.. కానీ మహిళల అండంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో పూర్తిగా అంచనా లేకపోతున్నామని చెప్పింది.
ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే గర్భవతులైన మహిళలు కరోనా సోకకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 150 మంది ప్రెగ్నెంట్స్ కు కరోనాకు సోకిందని.. వీరిలో 60 మందిపై పరిశోధనలు చేస్తున్నారని అన్నారు. చాలా వరకూ చైనా, యూకే లకు చెందిన కేసులేనని అన్నారు. కానీ తల్లి నుండి గర్భస్థ శిశువుకు వైరస్ ఎలా సోకుతుందో అన్న విషయంపై సరైన అవగాహన లేదని ఆమె తెలిపారు. మొదటి మూడు నెలల్లో కరోనా వైరస్ సోకితే అబార్షన్ అవకాశం ఉందని ఆమె అన్నారు. అందుకే గర్భవతులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వైద్యులను ఎక్కువ సార్లు కలవకుండా.. అత్యవసరం అయిన సమయాల్లో మాత్రమే కలవాలని డాక్టర్ దేవి సూచించారు.
గర్భంతో ఉన్న వాళ్ళు సాధ్యమైనంతగా ఇళ్లల్లో ఉండడానికే ప్రయత్నించాలని.. చేతులు తరచుగా కడుక్కుంటూ.. సామాజిక దూరాన్ని పాటించాలని అన్నారు. కళ్ళను, నోటిని, ముక్కును ముట్టుకోడాన్ని ఆపాలని సూచించారు. పిల్లలకు సంబంధించిన ఫంక్షన్స్ కూడా పెట్టుకోకపోవడమే మంచిదని.. ఎక్కువ మంది ఒక చోట చేరడం సరైన పద్ధతి కాదని ఆమె అన్నారు. నెలలు నిండిన సమయంలో మహిళల్లో శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయని.. అది కరోనా కారణంగా అని పొరపాటు పడకూడదని సూచించారు.
ఒకవేళ సదరు మహిళ విదేశాలకు వెళ్లి వచ్చినా.. కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తులకు దగ్గరగా ఉన్నట్లు తెలిసినా అలాంటి సమయంలో వెంటనే స్థానిక హెల్త్ అధికారులకు సమాచారాన్ని అందించాలని అన్నారు. అన్ని రకాల టెస్టులు చేయించాలని.. పాజిటివ్ అని తేలితే వైద్యుల సూచనలను పాటించాలని అన్నారు. కరోనా బారిన పడిన వాళ్ళు రెండు మూడు వారాల్లో రికవరీ అవుతారని.. టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు.