వీల్ ఛైర్ లోనే విధికి సవాల్ విసిరిన ధీర..!
By మధుసూదనరావు రామదుర్గం Published on 19 July 2020 8:46 AM GMTఅనూహ్యంగా ప్రమాదం సంభవిస్తే.. ప్రాణాలు పోతాయి.. అంగవైకల్యం సంభవిస్తుంది. పోయేది ప్రాణమే మాత్రమే కాదు.. ఆ ఊపిరిని నిలుపుకొన్న దేహం కూడా.. ఆ దేహాన్ని నమ్ముకున్న ఆత్మీయుల ఆప్తులు ఆశలు కలలు కూడా! మరి ప్రాణాలతో బైటపడి శరీరాకృతిని పోగొట్టుకుంటే.. ఇంటికే పరిమితమయ్యే పరిస్థితి సంభవిస్తే.. అది మరింత ఘోరం. ఒంటరితనం జీవితాన్ని కమ్మేస్తుంది. కన్నీళ్లు ఇంకిపోతాయి. ఇది సాధారణ మనుషుల పరిస్థితి. కానీ కొందరు అలా కాదు.. వారు చాలా త్వరగా కోలుకుంటారు. మంచం నుంచి మనసు నుంచి కూడా! పంజాబ్ కు చెందిన ప్రతిష్ట దేవేశ్వర్ ఈ కోవకు చెందిన యువతే. ప్రమాదం ఆమె శరీరాన్ని శిథిలం చేసిందే కానీ మనసును కాదు. వీల్ ఛైర్ కే పరిమితమైన ఆ యువతి విద్యను అస్త్రంగా మలచుకుని విధికి ఎదురు తిరిగి సవాల్ విసిరింది. వళ్లు రోమాంచితమయ్యే ఆమె ధీరగాథ ఇదీ!
ప్రతిష్ఠ పట్టుమని పదమూడేళ్ల వయసు నిండకుండానే జీవితంలో పెను ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కుటుంబంతో సరదాగా హోషియార్పూర్ నుంచి చండీగఢ్ కు వెళుతుండగా అనుకోకుండా కారు యాక్సిడెంట్ అయింది. స్పృహ తప్పింది. కళ్లు తెరచి చూసేసరికి ఆస్పత్రిలో ఉంది. ఆపరేషన్ తప్పని సరి చేయాల్సిందే మరో మార్గం లేదు. కానీ శరీరంలో రక్తం తక్కువ ఉన్నందున ఆపరేషన్ సమయంలో ఏమైనా జరగొచ్చు అని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. ఏమైతే అయింది ఆపరేషన్ చేయండని ప్రతిష్ట కుటుంబ సభ్యులు తమ అంగీకారం తెలిపారు. అంతటి దురదృష్టంలో కాసింత అదృష్టంగా ప్రతిష్ఠ ఆపరేషన్ అనంతరం ప్రాణాలతో బైటపడగలిగింది.
అయితే వెన్నముకకు గాయం కారణంగా పక్షవాతం వచ్చింది. రెండు కాళ్లు అచేతనమయ్యాయి. దాదాపు నాలుగు నెలలు ఐసీయూలోనే పెట్టారు. అంతటితో కష్టాలు ఆగలేదు. మూడేళ్లు మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. మనసును గట్టి చేసుకున్న ప్రతిష్ట వాస్తవాన్ని అర్థం చేసుకుని బెడ్‌మీద ఉంటూనే తిరిగి తన చదువులు ప్రారంభించింది. 10వ తరగతిలో 90 శాతం మార్కులు వచ్చాయి. పెదాలపై చిన్నపాటి నవ్వు వెలిగింది. 12వ తరగతిలోనూ అదే జోరు.. 90 శాతం తెచ్చుకుంది. జీవితం పై మళ్లీ ఆశలు చిగురించాయి. తన అంగవైకల్యం చదువుకు అడ్డుకాదని తేలిపోయింది. అంతే కాదు ఈ పరిస్థితిలోంచి బైటపడాలంటే చదువే అసలైన వారధి అని నిర్ణయించుకుంది. ఎంత పెద్ద సమస్యనైనా చిన్నపాటి సులువుతో పరిష్కరించే అవకాశం ఉందని అర్థం అయింది. చాల ఏళ్లు తర్వాత మొదటి సారిగా మనసారా నవ్వింది.
12వ తరగతిలో సాధించిన ఘనవిజయం ప్రతిష్టను మరింత ఉత్సాహపరిచింది. సాగిపో మున్ముందుకు లేదెవరూ అడ్డు నీకు అంటూ చైతన్య గీతాలాపన చేసింది. అమ్మానాన్నతో మాట్లాడి తనను ఢిల్లీ విశ్వవిద్యాలయానికి పంపాల్సిందిగా కోరింది. వారు నిండు మనసుతో సరే అనడంతో ఢిల్లీలోని శ్రీరామ్ మహిళా కాలేజీలో చేరింది. జీవితంలో వసంతం తనకు తానే తరలి వచ్చి చల్లగా పలకరించింది. రానున్నది మంచికాలం అని మనసూ చెప్పింది. కళాశాలలో సాటి విద్యార్థులు, అధ్యాపకులు, యాజమాన్యం అందరూ ఆత్మీయంగా సహకరించారు. ఏ సహాయం కావాలన్నా అడిగిన అరక్షణంలోనే అందించారు. ప్రతిష్ఠ కు మెలమెల్లగా సమాజంలో నాలాగ ఎందరో కదా మరి వారి సంగతేంటి అన్న ఆలోచన పొడిమింది. అలాంటి అసహాయులకు తాను గొంతుగా మారాలని దృఢంగా నిశ్చయించుకుంది.
దేశంలో అంగవైకల్యం ఉన్నవారికి సంబంధించి ఇంకా ఎన్నో సంస్కరణలు రావాలని ఎలుగెత్తి వినిపించింది. తమను కేవలం దివ్యాంగులంటేనే సరిపోదు జీవితంలో మెరుగుదల సాధించడానికి దివ్యమైన తోడ్పాటు అవసరం అని ప్రతిష్ట భావన. మనో నిశ్చయం ఉంటే.. గుండె నిబ్బరం ఉంటే.. వైకల్యం అనేది పెద్ద సమస్య కానే కాదు అని తనలాంటి పదుగురికి చాటి చెప్పడానికి సిద్దమైంది. అందుకు అవసరమైన పబ్లక్ పాలసీ కోసం అన్వేషించింది. ఈ క్రమంలోనే తన ప్రయత్నాలకు ఏకంగా ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచే అనుమతి లభించింది. ఈ కోర్సు పూర్తి చేశాక దేశంలోని 2 కోట్ల 68 మంది దివ్యాంగులకోసం అహరహం శ్రమించాలని సంకల్పించుకుంది. వీల్ చైర్ లో ఉంటేనేం విజయాన్ని ఎవరాపగలరు అని తననే సజీవోదాహరణగా చూపి తనలాంటి సమూహాన్ని ఉత్తేజపరచాలని, కార్యోన్ముఖులను చేయాలని నడుంబిగించింది.
ఢిల్లీ చదువులనంతరం ఒంటరిగా తన పనులు తాను చేసుకునేలా శరీరాన్ని సిద్ధం చేసుకుంది. దేశంలో వీల్ చైర్ లో ఉండేవారికి సౌకర్యాలు అందించే ప్రదేశాలను గుర్తించింది. షాపింగ్ కు వెళ్లడం ప్రయాణాలు చేయడం లాంటి కష్టమైన పనులు అలవాటు చేసుకుంది. కొన్ని పనులు చేయడం మాత్రం కష్టమయ్యేవి. బస్సులు, క్యాబ్ లలో ప్రయాణించడం అసాధ్యమని అర్థమయ్యాక వీల్ చైర్ పైనే కిలోమీటర్లు ప్రయాణించడం అలవరచుకుంది.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కష్టకాలంలో కూడా తన పోరాటం ఆగిపోలేదని సమాజానికి తెలపగలిగింది. వీల్ ఛైర్ లో ఉంటూనే విధికి సవాల్ విసిరిన ధీశాలి ప్రతిష్ఠ. లేకపోతే ఒక ప్రమాదంలో చిక్కుకున్న బాధితురాలు తిరిగి తనను తాను కూడదీసుకుని నిలబడగలదని విధితో కలబడగలదని అందులో గెలవగలదని ఎవరైనా ఊహించగలమా? ప‌్రతిష్ఠ విద్యా ప్రగతికి ముచ్చటపడి పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్.. చాలామందికి స్పూర్తి నిస్తున్నావ్.. చదువును ఇలాగే కొనసాగించు.. దేశానికి నీవంతు సాయం చేయి.. అంటూ ట్వీట్ చేశారు. ఇది చాలు ప్రతిష్ట దేవేశ్వర్ జీవితం ఎంత విజయవంతమైందో చెప్పడానికి.