ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమం
By తోట వంశీ కుమార్
తాను వేరే పరీక్షల కోసం నిన్న ఆసుపత్రికి వెళ్లగా.. తనకు కరోనా కూడా సోకినట్టు నిర్ధారణ అయిందని భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. వారం రోజులుగా తనను కలిసిన వారందరినీ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఆయన సూచించారు. కాగా.. ఆయన దిల్లీలోని ఆర్మీ రిసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మెదడుకు వెళ్లే నాళాల్లో రక్తం గడ్డకట్టడంతో ఆయనకు సర్జరీ చేశారు. కాగా.. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై ఉన్నారని మంగళవారం విడుదల చేసిన మెడికల్ బులిటెన్‌లో వెల్లడించారు.
ప్రణబ్ త్వరగా కోలుకోవాలంటూ పలువురు నేతలు ట్వీట్లు చేస్తున్నారు. రాహుల్ గాంధీ, రణదీప్ సూర్జేవాలా, అభిషేక్ సింఘ్వి, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు ప్రణబ్ కోలుకోవాలంటూ ట్వీట్లు చేశారు.
కాగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ప్రణబ్ ముఖర్జీ.. 2012 నుంచి 2017 వరకు భారత రాష్ట్రపతిగా ఉన్నారు. అంతకుముందు మన్మోహన్ సింగ్, ఇందిరాగాంధీ ప్రభుత్వాలలో ఆర్థిక మంత్రిగా.. మన్మోహన్ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా.. పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలలో విదేశీ వ్యవహారాల మంత్రిగానూ పనిచేశారు.