చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలు.. చదువు కోసం రోజూ 10 కిలోమీటర్లు నడిచిన ప్రణబ్‌

By సుభాష్  Published on  1 Sep 2020 3:35 AM GMT
చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలు.. చదువు కోసం రోజూ 10 కిలోమీటర్లు నడిచిన ప్రణబ్‌

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ నిన్న సాయంత్రం కన్నుమూసిన విషయం తెలిసిందే. ప్రణబ్‌ భారత రాజకీయ చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రణబ్‌ ఇక లేరని తెలుసుకున్న దేశం ఆయన సేవలను స్మరించుకుంటోంది. సుమారు ఐదు దశాబ్దాలపాటు పార్లమెంట్‌తో తన అనుబంధం కొనసాగింది. సామాన్యుడి నుంచి రాష్టపతి వరకు అంచలంచెలుగా ఎదిగిన ప్రణబ్‌ వెనుక ఎంతో శ్రమ ఉంది. ఆయన జీవితంలో ఎన్నో కీలక పదవులు చేపట్టారు.

చిన్నతనం నుంచే కష్టాలు..

చిన్నతనం నుంచి ఎన్నోకష్టాలను చవిచూసి అంచలంచెలుగా ఎదిగారు. 1935 డిసెంబర్‌ 11న పశ్చిమబెంగాల్లోని ఓ మారుమూల గ్రామంలో జన్మించిన ఆయన.. బాల్యంలో పాఠశాలకు వెళ్లడం కోసం రోజూ 10 కిలోమీటర్లు నడిచివెళ్లేవారు. అప్పట్లో మాకు ఎలాంటి రవాణా సౌకర్యాలు ఉండేవి కావు..చిన్న తనంలో చదువు కోసం పది కిలోమీటర్ల దూరం నడవాల్సి వచ్చేది. వేసవి, వర్షాకాలంలో పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉండేది... అని ప్రణబ్‌ ముఖర్జీ గతంలో ఓ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. బీర్భూమ్‌లోని సూరి విద్యాసాగర్ కళాశాలలో, కోల్‌కతా యూనివర్సిటీలో ప్రణబ్‌ ఉన్నత విద్య కొనసాగింది. పొలిటికల్‌ సైన్స్‌, హిస్టరీలో ఎంఏ డిగ్రీతోపాటు ఆయన ఎల్‌ఎల్‌బీ డిగ్రీ కూడా చేశారు. ప్రణబ్‌ తండ్రి కమదా కింకార్‌ ముఖర్జీ ఓ స్వాతంత్ర్య సమరయోధుడు. మహాత్మగాంధీ నేతృత్వంలో స్వాతంత్ర్య పోరాటం, ఉద్యమాల్లో పాల్గొన్న కారణంగా ఆయన ఎన్నో సార్లు జైలుకు వెళ్లి వచ్చారు. ఆ రోజుల్లో సరైన తిండి కూడా దొరికేది కాదని, బెంగాల్లో దాదాపు 50 లక్షల మంది ఆకలితో చనిపోయారని పార్లమెంట్‌లో ఆహార భద్రతా బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రణబ్‌ చెప్పుకొచ్చారు.

Next Story