21న ప్రగతి భవన్ ముట్టడిస్తాం - కాంగ్రెస్

By Medi Samrat  Published on  15 Oct 2019 10:29 AM GMT
21న ప్రగతి భవన్ ముట్టడిస్తాం - కాంగ్రెస్

రాష్ట్రంలో 11 రోజులుగా సమ్మె జరుగుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ మ‌జ్దూర్ యూనియ‌న్ గౌరవ అధ్యక్షుడు హరీష్ రావు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయకపోతేనే సమ్మె నోటీస్ ఇచ్చి రంగంలోకి దిగారన్నారు. ఆర్టీసీ కార్మికుల కాళ్లకు ముళ్ళు కుచ్చుకుంటే.. నోటి తీస్తాను అని చెప్పి.. వాళ్ళ గుండెల్లో గుణపం గుచ్చుతున్నాడని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.

అధికార మదంతో ఆర్టీసీ ఉద్యమాన్ని అణచి వేయాలని సీఎం కేసీఆర్ చూస్తున్నార‌ని.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. ఉద్యోగుల‌కు పీఎఫ్, సీఫిఎస్ అమలు చేయాలని కోరారు. ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన ప్రతి కార్యక్రమానికి కాంగ్రెస్ మద్దతు ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 21న‌ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు.

ప్రగతి భవన్ లో హస్కి అనే కుక్క చనిపోతే సంబంధించిన డాక్టర్ లపై కేసు పెట్టారని.. పువ్వాడ అజయ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు బరి తెగించి మాట్లాడడం వలన ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని.. మంత్రులు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం వలనే ఆర్టీసీ కార్మికులు చనిపోయారు కాబట్టి వారిపై కూడా కేస్ లు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవ‌ద్ద‌ని.. మీకు మేము అండగా ఉంటామని భ‌రోసా ఇచ్చారు. ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన హరీష్ రావు, ఈటెల రాజేందర్ ఎందుకు మాట్లాడడం లేదని నిల‌దీశారు. కేసీఆర్ నిర్ణయం ప‌ట్ల‌ మంత్రి వర్గంలో చీలిక వచ్చిందని. బీటీ బ్యాచ్ ఆర్టీసీ సమ్మెను వ్యతిరేకిస్తోందని.. యూటీ బ్యాచ్ ఆర్టీసీ సమ్మెను సపోర్ట్ చేస్తుందని ఎద్దేవా చేశారు.

పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావుకు కూడా కేసీఆర్ అపాయింట్ మెంట్ దొరకడం లేదు అంటే అర్థం ఏంట‌ని.. పార్టీలో ఆర్టీసీ సమ్మెపై చీలిక వచ్చిందనే అర్థమ‌ని రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికులు కాల్చుకుని చనిపోతుంటే కేసీఆర్ దగ్గరికి విందు భోజనానికి ఎలా వెళుతారని టీఎన్‌జీఓ, టీజీఓ ప్ర‌శ్నించారు. నాయకులారా మీరు ప్రజల పక్షమా..? కేసీఆర్ పక్షమా..? తేల్చుకోవాలన్నారు రేవంత్ రెడ్డి.

Next Story