భారీగా పట్టుబడ్డ 'గంజాయి'
By Newsmeter.Network Published on 3 Dec 2019 2:17 PM ISTఈ మధ్యన గంజాయి రవాణా మళ్లీ అధికమవుతోంది. అధిక ధనార్జనే ధ్యేయంగా గుట్టు చప్పుడు కాకుండా గంజాయి మొక్కలను ఇతర పంటల్లోపండిస్తూ ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. పోలీసులు ఎన్ని తనిఖీలు చేపట్టి పట్టుబడ్డ గంజాయిని దగ్ధం చేస్తున్నా... గంజాయి రవాణా జరుగుతూనే ఉంది. తాగాజా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా టోల్ ప్లాజా వద్ద ఎక్సైజ్ పోలీసుల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీ ఎత్తున గంజాయిని పట్టుకున్నారు. సూమారు 6 కేజీల 500 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని, ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేశారు. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో బెంగళూరు కు వెళ్ళే క్రమంలో, పక్కాసమాచారంతో ఈ దాడులు నిర్వహించమని ఎక్సైజ్ సీఐ ప్రమీలా రాణి తెలిపారు.
గత కొన్ని రోజులుగా ఈ దందా సాగుతున్నట్లు తమకు సమాచారం అందిందని, ఇందులో భాగంగానే తాము టోల్ ప్లాజా వద్ద తనిఖీలు ముమ్మరం చేశామని చెప్పారు. అరెస్టు అయిన వారిని విచారిస్తున్నామని, విచారణలో మరింత సమాచారం తెలిసే అవకాశం ఉందన్నారు. పూర్తి స్థాయిలో గంజాయి పంటను నాశనం చేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కార మార్గం సుగమం అవుతుందని పోలీసులు గుర్తించకపోవటంలో విఫలం కావడం వల్లే గంజాయి రవాణా యథేచ్ఛగా సాగుతుందనేది వాదనలు లేకపోలేదు. గంజాయి పట్టుబడ్డ సమయంలోనే గంజాయిని తగులబెడుతున్నారే తప్ప, పూర్తి స్థాయిలో గంజాయి లేకుండా చేయడంలో ఉన్నతాధికారులు విఫలమవుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.