మేడమ్.. హైదరాబాద్ లో మిస్ అవుతోంది ఏమిటో తెలుసా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 May 2020 10:07 AM GMT
మేడమ్.. హైదరాబాద్ లో మిస్ అవుతోంది ఏమిటో తెలుసా..?

పూజ హెగ్డేకు హైదరాబాద్ తో అనుబంధం ఎంతో స్పెషల్. ఎందుకంటే తమిళంలోనూ, హిందీలోనూ ఆమె మొదలుపెట్టిన ప్రయాణం అంత సక్సెస్ కాలేదు. తెలుగులో డీజేతో సక్సెస్ ను అందుకున్న పూజ.. ఇక్కడే ఎక్కువ సినిమాలు చేస్తూ ఉంది. అందుకే తనకు తెలుగు అభిమానులన్నా.. హైదరాబాద్ అన్నా ఎంతో ఇష్టమని అంటోంది. ఆమె కెరీర్ నిలబడడానికి ముఖ్య కారణమే తెలుగు సినిమాలు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ముంబైలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటోంది.లాక్ డౌన్ కారణంగా తనకు బాగా నచ్చిన ఓ ఫుడ్ ను చాలా మిస్ అవుతున్నానని చెబుతోంది. ఇంతకూ పూజ మేడమ్ అంతగా మిస్ అవుతున్న వంటకం ఏమిటో తెలుసా..? హలీం. 'ఈ రంజాన్ మాసంలో హైదరాబాదులో దొరికే హలీం వంటకాన్ని బాగా మిస్ అవుతున్నాను' అని పూజ హెగ్డే తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేసింది. రంజాన్ మాసంలో హైదరాబాద్ అంటే హలీం అని చెబుతూ ఉంటారు. వీధి వీధిలో హలీం అంగళ్లు వెలిసే ఉంటాయి. కొన్ని స్పెషలిస్ట్ హలీం మేకర్స్ చేస్తే ఆవురావురుమంటూ లాగించేస్తూ ఉంటారు. గత కొద్ది సంవత్సరాలుగా హలీంకు బాగా అలవాటు పడినట్లు ఉంది పూజ హెగ్డే.. అందుకే ఈసారి బాగా మిస్ అవుతున్నానని చెబుతోంది. ఈసారి హైదరాబాద్ లో కూడా హలీం కేవలం హోమ్ డెలివెరీకి మాత్రమే అనుమతులు ఇచ్చారు.

పూజ హెగ్డే అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలోనూ, ప్రభాస్ సరసన మరో సినిమాలోనూ నటిస్తోంది. సల్మాన్ ఖాన్ తో కూడా మరో సినిమా చేయడానికి పూజ హెగ్డే ఒప్పుకుంది. ఇప్పుడు మలయాళ హీరో దుల్ఖర్ సల్మాన్ సరసన ఓ తెలుగు సినిమాలో నటించడానికి పూజ ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించే ఓ చిత్రంలో దుల్ఖర్ హీరోగా నటిస్తున్నాడు. ఇందులో హీరోయిన్ పాత్రకు పూజను ఎంచుకున్నారని అంటున్నారు.

Next Story