మహమ్మారి కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. లక్షల సంఖ్యలో కరోనా బారిన పడగా.. వేలాది మంది ప్రజలు మృత్యువాత పడుతున్నారు. భారత్‌లోనూ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 1071 కరనా కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే మన దేశంలో కరోనా వైరస్‌ ఇంకా స్థానిక వ్యాప్తి దశలోనే ఉందని ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్ తెలిపారు.

కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేయడంలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు చేసింది. దీంతో పబ్లిక్‌, ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్టు పూర్తిగా నిలిచిపోయింది. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. ఫలితంగా ప్రజలు రోడ్డెక్కడం లేదు.. ధ్వని కాలుష్యం కూడా తగ్గింది. దేశ వ్యాప్తంగా ఎప్పుడు రద్దీగా ఉండే చాలా ప్రాంతాలు.. ఇప్పుడు పూర్తిగా నిర్మానుష్యమయ్యాయి. అయితే దీని వల్ల కొంత మేలు జరిగిందని పలువురు పర్యావరణ నిపుణులు అంటున్నారు.

మన దేశంలో కాలుష్య తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలుసు. ప్రస్తుత లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఢిల్లీ మొదలుకొని పలు నగరాల్లో గత కొన్ని రోజులుగా కనిష్ట వాయు కాలుష్యాన్ని నివేదిస్తున్నాయి. కాలుష్యం తగ్గడాన్ని పర్యావరణ ప్రేమికులు స్వాగతిస్తున్నారు. దీనిని ప్రభుత్వాలు దృష్టిలో ఉంచుకొని, భవిష్యత్తులో కూడా పర్యావరణాన్ని కాపాడే విధంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.

లాక్‌డౌన్‌ కారణంగా దేశంలోని అన్ని నగరాల్లో ట్రాఫిక్ పూర్తిగా తగ్గిపోయింది. దీంతో కాలుష్యస్థాయి అమాంతం పడిపోయింది. నిజం చెప్పాలంటే.. ఇది పర్యావరణానికి ఎంతో మంచి పరిణామం.

భారత్‌లోని అత్యంత రద్దీ ప్రాంతమైన ఘజియాబాద్‌, నొయిడా హైవేలో వాహన రాకపోకలు తగ్గడంతో గాలిలో నాణ్యత పెరిగింది.

ఢిల్లీలో 30 శాతం వరకు గాలిలో ధూళి కణాలు తగ్గితే, అహ్మదాబాద్‌ పుణేలలో 15 శాతం వరకు తగ్గాయి

సాధారణంగా మార్చి నెలలో గాలిలో నాణ్యత సూచి మధ్యస్థంగా (100–200) ఉంటుంది. కానీ ఇప్పుడు సంతృప్తికరం (150–100)గా ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో వీస్తున్న గాలి చాలా ఆరోగ్యకరమైనదిగా ఉందని సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు కూడా గుర్తించింది. దేశంలోని 39 నగరాల్లో గాలి నాణ్యతా సూచి బాగుంది రేంజ్‌లో ఉంటే, 51 నగరాల్లో సంతృప్తికర స్థాయిలో ఉందని తెలిసింది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.