యువగళం యాత్ర ముగింపు సభకు పవన్ కళ్యాణ్ దూరం

నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో కొనసాగుతోంది.

By Srikanth Gundamalla
Published on : 16 Dec 2023 4:23 PM IST

yuvagalam, meeting, lokesh, tdp, pawan kalyan ,

యువగళం యాత్ర ముగింపు సభకు పవన్ కళ్యాణ్ దూరం

టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ పాదయాత్ర ఈ నెల 20వ తేదీన ముగియనుంది. ముగింపు సభను భోగాపురం మండలం పోలిపల్లి వద్ద ఈ నెల 20న నిర్వహించనున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. ఈ ముగింపు సభకు తాను హాజరుకాలేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ప్రకటించారు. ఈ మేరకు టీడీపీ నేతలకు కూడా సమాచారం అందించారట. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఈ ఏడాది జనవరి 27న ప్రారంభం అయ్యింది. డిసెంబర్‌ 20న ముగుస్తుంది. టీడీపీ-జనసేన రాష్ట్రంలో కలిసి ముందుకు వెళ్తున్న విషయం తెలిసిందే. టీడీపీ ఈ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పవన్‌ కళ్యాణ్‌ సభకు రావాలని ఆహ్వానం పంపింది. అయితే.. ఆ రోజు తనకు ముందుగా నిర్ణయించుకున్న ఇతర కార్యక్రమాలు ఉన్న సందర్భంగా.. యువగళం పాదయాత్ర ముగింపు సభకు రాలేనని పవన్ కళ్యాణ్‌ చెప్పారు. టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి మాత్రం తప్పకుండా వస్తానని టీడీపీ నేతలతో పవన్ చెప్పినట్లు తెలుస్తోంది. కాగా.. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఎన్నికల వేళ టీడీపీ నిర్వహించే పెద్ద సభలకు పవన్ హాజరుకానున్నారు.

మరోవైపు లోకేశ్‌ యువగళం పాదయాత్ర ముగింపు సభకు టీడీపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి అన్ని జిల్లా నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలి వెళ్లనున్నారు. ఈ సభకు దాదాపు 5 లక్షల మంది వస్తారని టీడీపీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో 7 ప్రత్యేక రైళ్లు కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. తొలుత ఈ సభకు పవన్‌ కళ్యాణ్ వస్తారని అంతా భావించారు. కానీ.. ఇతర పనుల కారణంగా ఆయన రాలేకపోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో పాటు ఇతర ముఖ్యనేతలంతా సభకు హాజరు అవుతారు.

Next Story