కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనమేనా? రాయబారం నడిపిందెవరు..?
కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ వైఎస్‌ఆర్‌టీపీని విలీనం చేసేందుకు అంతా సిద్ధమైందని తెలుస్తోంది.
By Srikanth Gundamalla Published on 10 Aug 2023 8:59 AM GMTకాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనమేనా? రాయబారం నడిపిందెవరు..?
తెలంగాణలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సుపరిపాలన తెచ్చేందుకే వైఎస్ షర్మిల పార్టీని స్థాపించారు. కానీ.. అనుకోని విధంగా ఆమె కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పార్టీని స్థాపించాక కనీసం ఒక్క ఎన్నికను కూడా ఎదుర్కోకుండానే కాంగ్రెస్ హస్తాన్ని అందుకునేందుకు సిద్ధమవుతోంది. అధికార పార్టీ బీఆర్ఎస్‌ను నిలదీస్తూ.. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ తెలంగాణకు అవసరమైనవన్నీ సమకురుస్తానని చెప్పిన షర్మిల.. పార్టీ స్థాపించి రెండేళ్లు గడవకముందే తన తండ్రిని ఆదరించిన కాంగ్రెస్ పార్టీలో చేరాలని డిసైడ్ అయినట్లు రాజకీయంగా చర్చించుకుంటున్నారు. అయితే..వైఎస్ షర్మిల, కాంగ్రెస్ పార్టీ మధ్య రాయబారం నడిపింది ఎవరు?
వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సమయం దగ్గర పడినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా కాంగ్రెస్ వైపు చూస్తోన్న షర్మిల... మరికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ కండువా కప్పుకోనుందని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. అయితే.. ఇదే అంశంపై గతంలో స్పందించిన వైఎస్ షర్మిల.. కాంగ్రెస్ నుంచే తనకు ఆఫర్ వచ్చిందని.. తనంతట తానుగా వెళ్లాలనుకోలేదని చెప్పింది. ఈ క్రమంలో వైఎస్ షర్మిలను కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చేందుకు వైఎస్‌ఆర్ ఆత్మబంధువు కేవీపీ రామచంద్రరావు రంగంలోకి దిగారట. షర్మిల, కాంగ్రెస్ మధ్య రాయబారం నడిపారని.. ఆమె పార్టీని హస్తంలో విలీనం చేసేందుకు అన్ని విధాలా నచ్చజెప్పి అన్నీ సిద్ధం చేశారని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.
2021 జూలై 8న వైఎస్‌ఆర్ జయంతి సందర్భంగా షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీని ప్రారంభించారు. ఆ తర్వాత తండ్రి మార్గానే అనుసరిస్తూ.. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. దాదాపు 4వేల కిలోమీటర్లకు పైగా షర్మిల పాదయాత్ర చేశారు కూడా. అయితే.. పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆమెకు పెద్దగా ప్రజల నుంచి మద్దతు రావడం లేదని భావించారు. దాంతో.. ఇతర పార్టీల్లోకి వెళ్తే బాగుంటుందనే ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. ఇక ఆ సమయంలోనే కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అప్పటికే బీజేపీ, బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్న షర్మిల.. కాంగ్రెస్‌వైపు మళ్లారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో రెండుసార్లు పొత్తు ప్రస్తావన తెచ్చారు. ఇక కుటుంబ సన్నిహితుడు కేవీపీ రంగంలోకి దిగి పొత్తు ప్రస్తావన మరింత ముందుకు నడిపించారు. తెరవెనుక రాజకీయం నడిపించి.. షర్మిలను కాంగ్రెస్‌లో చేరేలా ఒప్పించారట. షర్మిల ద్వారా వైఎస్ ఇమేజ్‌ను ఉపయోగించుకుని తెలంగాణతో పాటు ఏపీలోనూ బలపడాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.
కాగా.. షర్మిల పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు ముందు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అభ్యంతరం చెప్పారట. తెలంగాణ తెచ్చుకున్నది స్వరాష్ట్ర పాలన కోసమని.. షర్మిలను తేవడం ద్వారా పార్టీకి నష్టమని చెప్పారట. అయితే.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయని.. దాంతో.. అందరినీ కలుపుకొని ముందుకు సాగడమే మంచిదని కాంగ్రెస్ అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది. పైగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కూడా ఈ విషయంపై రేవంత్‌రెడ్డితో మాట్లాడరని చెబుతున్నారు పలువురు రాజకీయ నాయకులు. రాహుల్‌గాంధీ మాట కాదనలేక రేవంత్‌రెడ్డి కూడా షర్మిలను కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు సుముఖత తెలిపారని సమాచారం. కాంగ్రెస్ కండువా షర్మిలకు కప్పేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
షర్మిల పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు అన్ని అడ్డంకులు తొలిగాయని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో షర్మిల కాంగ్రెస్‌లో చేరే అంశంపై ప్రకటన కూడా విడుదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. షర్మిలను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నుంచి బరిలో దింపాలని భావిస్తున్నట్లు సమాచారం అందుతోంది. తెలంగాణ ఎన్నికల తర్వాత ఏపీలోనూ పార్లమెంట్ ఎన్నికల్లో షర్మిలను నిలబెట్టి వైఎస్ సెంటిమెంట్‌ను వాడుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.