నేటి నుంచే షర్మిల 'ప్రజా ప్రస్థానం'
YS Sharmila Padayatra starts from Today.తెలంగాణ రాష్ట్రంలో మరో పాదయాత్రకు రంగం సిద్దమైంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ
By తోట వంశీ కుమార్ Published on 20 Oct 2021 5:26 AM GMTతెలంగాణ రాష్ట్రంలో మరో పాదయాత్రకు రంగం సిద్దమైంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల "ప్రజా ప్రస్థానం" మహా పాదయాత్ర నేడు చేవెళ్లలో మొదలు కానుంది. బుధవారం చేవెళ్ల నుంచి ప్రారంభించబోయే పాదయాత్ర మొత్తం 90 నియోజకవర్గాల్లో 4 వేల కిలోమీటర్ల కొనసాగి తిరిగి చేవెళ్లలోనే ముగియనుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పాలనే లక్ష్యంగా షర్మిల ప్రజా ప్రస్థానం మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
ఈ ఉదయం శంకర్ పల్లి క్రాస్ రోడ్డు వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 11.30 గంటలకు షర్మిల పాదయాత్ర ప్రారంభం కానుంది. చేవెళ్ల బస్టాండ్ సెంటర్ మీదుగా 2.5 కిలోమీటర్లు నడిచి మధ్యాహ్నం 12.30 గంటలకు షాబాద్ క్రాస్ రోడ్డుకు చేరుకుంటారు. అక్కడ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నారు. అక్కడి నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న కందవాడ గేట్ క్రాస్ వద్దకు పాదయాత్ర చేరుకోనుంది. అక్కడ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం సాయంత్రం 3.00 గంటలకు కందవాడ గేట్ క్రాస్ నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. ఎర్రోనికొటల, కందవాడ, గుండాల మీదుగా నారాయన్‌దాస్‌గూడ క్రాస్‌రోడ్‌కు చేరుకుంటారు. నక్కలపల్లి వద్ద రాత్రి బస చేస్తారు. తొలి రోజు మొత్తం 10 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది.
కాగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2003లో చేవేళ్ల నుంచే పాదయాత్ర చేపట్టారు. రాష్ట్రమంతా తిరిగి 2004లో అధికారాన్నిచేపట్టిన సంగతి తెలిసిందే.