పుట్టినిల్లు-మెట్టినిల్లు కాన్సెప్ట్‌తో షర్మిల..!
YS Sharmila New Party Updates. తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టాలని వైఎస్ షర్మిల నిర్ణయించుకోవడం.
By Medi Samrat Published on 16 Feb 2021 11:26 AM GMTతెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టాలని వైఎస్ షర్మిల నిర్ణయించుకోవడం.. అందుకు సంబంధించి ప్రకటన కూడా చేయడం రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఎప్పుడైతే షర్మిల పార్టీ పెట్టడం ఖాయం అని తెలిసిందో అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో విమర్శలు, సానుభూతి అన్నీ మొదలయ్యాయి. అయితే కొందరు ఆమె వెనుక కేసీఆర్ ఉన్నారని ఆరోపిస్తే.. మరికొందరు ఆమె పార్టీ వెనుక బీజేపీ ఉందని విమర్శిస్తున్నారు. మరోవైపు ఆమె పార్టీతో మాకేమీ సంబంధం లేదని ఏపీలోని వైఎస్ జగన్ సారథ్యంలోని వైసీపీ తేల్చిచెప్పింది. త్వరలో ఆమె ప్రజల ముందుకు రాబోతుంది.
పక్క రాష్ట్రానికి చెందిన వ్యక్తి తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి ఏ విధంగా ఇక్కడ ప్రజలను ఆకట్టుకుంటారన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తెలంగాణలో పార్టీ పెట్టాలంటే ఇక్కడి వాళ్లకే హక్కు ఉందంటూ అధికార పార్టీ నేతలు చేసిన కామెంట్లను ఆమె గట్టిగా తిప్పికొట్టేందుకు సిద్ధమవుతున్నారట. తాను తెలంగాణ కోడలినని.. తనకు హక్కు ఉందని అనుచరుల దగ్గర షర్మిల వ్యాఖ్యానించారని సమాచారం.
అయితే నా పుట్టినిల్లు ఆంధ్ర అయితే మెట్టినిల్లు తెలంగాణ అంటూ ప్రచారం కొనసాగించబోతుందని వార్తలు వస్తున్నాయి. షర్మిల భర్త బ్రదర్ అనిల్ స్వస్థలం ఖమ్మం జిల్లా. ఆయన పెరిగింది హైదరాబాద్‌లోనే. ఈ లెక్కన తాను తెలంగాణ కోడలినని షర్మిల చెప్పనున్నారని.. ఇక ఆమె స్వస్థలం ఎలాగూ ఆంధ్ర. మొత్తానికి మరో రెండు నెలల్లో తెలంగాణలో షర్మిల పెట్టబోయే రాజకీయ పార్టీ విధివిధానాలతో పాటు మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.