వైసీపీ నాయకులు వారికి క్షమాపణ చెప్పాలి: వైఎస్ షర్మిల
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
By Srikanth Gundamalla Published on 27 April 2024 10:17 AM GMTవైసీపీ నాయకులు వారికి క్షమాపణ చెప్పాలి: వైఎస్ షర్మిల
ఏపీలో ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరపడింది. దాంతో.. రాజకీయాల్లో హీట్ మరింత పెరిగింది. ఇప్పటికే మేనిఫోస్టోను ప్రధాన పార్టీలు ప్రకటించాయి. ఇప్పుడు ప్రచారంలో దూసుకెళ్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఐదేళ్ల పాలనలో ఏ వర్గ ప్రజలను కూడా సంతోషంగా ఉండేలా చేయలేదని ఆమె విమర్శించారు. సీఎం జగన్ పాలనలో బడుగు బలహీన వర్గాల జీవన ప్రమాణాలు అధ్వాన్నం అయ్యాయంటూ విమర్శించారు. ఈ మేరకు సీఎం జగన్‌కు వైఎస్ షర్మిల బహిరంగ లేఖను రావారు.
బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాంగపరంగా దక్కాల్సిన హక్కులకు కూడా దిక్కులేని పరిస్థితులను తీసుకొచ్చారని వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. మరోవైపు వారికి అందాల్సిన నిధులను దారి మళ్లించి, బడ్జెట్ పరంగా సబ్‌ప్లాన్‌ను మంటగలిపారని అన్నారు. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు కొనసాగిన 28 పథకాలను, అధికారంలోకి రాగానే నిర్లక్ష్యం చేసి వాటిని నిలిపివేశారని వైఎస్ షర్మిల లేఖలో పేర్కొన్నారు. దళితులపై దాడులు, దాష్టీకాలు పెరుగుతున్నా పట్టనట్టే ఉన్నారని చెప్పారు. దాడులు నివారించి దళితులను కాపాడే నిర్దిష్ట చర్యలను వైసీపీ ప్రభుత్వం తీసుకోలేదనీ.. సీఎం జగన్ దళితుల పట్ల ఎప్పుడూ నిర్లక్ష్యంగానే ఉన్నారని వైఎస్ షర్మిల అన్నారు.
దళితులపై దాడులు చేసినవారిలో ఎక్కువ మంది వైసీపీ పార్టీకి చెందిన పెత్తందార్లే ఉన్నారంటూ షర్మిల చెప్పారు. ఎస్సీలకు మేలు చేయాల్సింది పోయి తిరిగి దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ ఐదేళ్లలే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. అందుకే వారికి వైసీపీ ప్రతినిధులు క్షమాపణలు చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. సీఎం జగన్‌కు లేఖ రాసిన వైఎస్ షర్మిల ఈ మేరకు డిమాండ్ చేశారు.