జగన్ ధర్నాకు ఎందుకు సంఘీభావం తెలపాలి: షర్మిల

మాజీ సీఎం జగన్‌పై కాంగ్రెస్‌ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు.

By Srikanth Gundamalla  Published on  27 July 2024 1:15 PM IST
ys sharmila, comments,  jagan, andhra pradesh,

జగన్ ధర్నాకు ఎందుకు సంఘీభావం తెలపాలి: షర్మిల

వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌పై కాంగ్రెస్‌ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు. ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టిన ఆమె.. జగన్‌.. మీ ధర్నాకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలని ప్రశ్నించారు. ‘‘పార్టీ ఉనికి కోసం దిల్లీలో కపట నాటకం ఆడినందుకా? వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా? ఐదు ఏళ్లు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకుని విభజన హక్కులు, ప్రత్యేక హోదాను వారికి తాకట్టు పెట్టినందుకా? అంటూ ఎక్స్‌ వేదికగా జగన్‌పై వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు.

వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. మణిపుర్ ఘటనపై ఇన్నాళ్లు నోరెత్తని జగన్‌ ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకురావడం విడ్డూరంగా ఉందంటూ విమర్శలు చేశారు. విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో జగన్‌ ఆనాడు బీజేపీకే మద్దతు ఇచ్చారంటూ ఆమె గుర్తు చేశారు. వైఎస్సార్‌ వ్యతిరేకించిన మతత్వ బీజేపీకే జైకొట్టారు కదా? అంటూ నిలదీశారు. మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా ఉద్యమం చేసిందనీ.. మీ నుంచి సంఘీభావం ఆనాడు వచ్చిందా అంటూ ప్రశ్నించారు. జగన్ నిరసనలో నిజం లేదని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉందని వైఎస్ షర్మిల అన్నారు. అందులో జగన్‌ స్వలాభం తప్ప... రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలపలేదని చెప్పారు. 11 మంది బలం సరిపోలేదా.. ఇప్పుడు కలిసి పోరాడుదాం అంటున్నారు? అని ఎక్స్‌ వేదికగా వైసీపీ, జగన్‌పై షర్మిల విరుచుకుపడ్డారు.



Next Story