ఏపీకి విలన్ కాంగ్రెస్సే..తెలంగాణలో ప్రభుత్వం కూలిపోతుంది: విజయసాయిరెడ్డి

కాంగ్రెస్‌ పార్టీపై వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Srikanth Gundamalla  Published on  5 Feb 2024 4:44 PM IST
ycp, vijay sai reddy, comments,  congress party,

ఏపీకి విలన్ కాంగ్రెస్సే..తెలంగాణలో ప్రభుత్వం కూలిపోతుంది: విజయసాయిరెడ్డి 

కాంగ్రెస్‌ పార్టీపై వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్‌కు ఏనాడూ లేదని విజయసాయిరెడ్డి అన్నారు. కానీ.. ఇప్పుడు దాన్ని ఒక ఎన్నికల అంశంగా మార్చాలని చూస్తోందని చెప్పారు. అసలు కాంగ్రెస్‌ పార్టీ ఏపీకి విలన్‌ అని అభివర్ణించారు. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చెప్పారని గుర్తు చేశారు. కానీ అది కంటి తుడుపు హామీగా మార్చారని అన్నారు. కాంగ్రెస్‌కు ఏపీపై శ్రద్ధ ఉంటే విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఆ అంశాన్ని ఎందుకు విస్మరించారని అన్నారు. హోదాను చట్టంలో చేర్చడం కాంగ్రెస్‌కు అప్పుడు చేతకాలేదు.. ఎప్పుడుందుకు ఇతరులను నిందితిస్తున్నారని విజయసాయిరెడ్డి ఆ పార్టీ నాయకులను నిలదీశారు.

ఏపీ ప్రజల మనోభావాలను కూడా కాంగ్రెస్‌ పార్టీ ఏనాడూ పట్టించుకోలేదని విజయసాయిరెడ్డి అన్నారు. 2004లో తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టిందనీ.. పదేళ్ల తర్వాత చిట్ట చివరలో అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించిందని అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు పది రోజుల ముందే రాష్ట్రాన్ని విభజించారని చెప్పారు. ఎన్నికల్లో లాభం పొందాలనే ఉద్దేశం తప్ప కాంగ్రెస్‌కు మరో ఆలోచన అప్పడు లేదని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. అందుకే కాంగ్రెస్‌ పార్టీ ఏపీకి విలన్‌ అన్నారు. కుటుంబ వ్యవహరంలో తల దూర్చడం కాంగ్రెస్‌ డర్టీ పాలిటిక్స్‌కు ఉదాహరణి అని చెప్పారు. ఇక తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ పార్టీ అబద్ధాలు చెప్పే అధికారంలోకి వచ్చిందన్నారు. త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు ఉన్నాయని విజయసాయిరెడ్డి చెప్పారు.

కాంగ్రెస్‌ పార్టీనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కోలుకోలేని నష్టాన్ని ఇచ్చిందని విజయసాయిరెడ్డి అన్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో నోటా కంటే కాంగ్రెస్‌కే తక్కువ ఓట్లు పడ్డాయని చెప్పారు. ఏపీకి చేసిన మోసానికి కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలే సరైన శిక్ష విధించారని చెప్పారు. జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్‌ పార్టీ కనుమరుగు అవుతుందన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40 సీట్లకు మించి రావని మమతా బెనర్జీ చెప్పినట్లు గుర్తు చేశారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన రాహుల్‌ గాంధీ.. 2024 ఎన్నికల్లో కూడా ఓడిపోతారని విజయసాయిరెడ్డి చెప్పారు.

Next Story