హుజూరాబాద్ ఉప ఎన్నిక బీజేపీకి ఎందుకంత ప్రతిష్టాత్మకం
Why Huzurabad by poll is crucial for BJP.హుజూరాబాద్ ఉప ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అధికారపక్షమైన టీఆర్ఎస్
By M.S.R Published on 29 Oct 2021 3:47 PM GMTహుజూరాబాద్ ఉప ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అధికారపక్షమైన టీఆర్ఎస్ కు బీజేపీ గట్టి సవాల్ విసిరింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ కు రాజీనామా చేయడం.. బీజేపీలో చేరడం.. ఇలా ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్నికలో ఈటల రాజేందర్ విజయం భారతీయ జనతా పార్టీ భవిష్యత్తును తెలియజేస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన ఈటల బీజేపీకి పెద్ద ప్లస్ అని అంటున్నారు. ఇప్పటికే పలువురు నేతలు బీజేపీలో చేరినప్పటికీ, రాజేందర్ లాంటి మాస్ లీడర్ ఇప్పటి వరకూ లేరు. ఆయనకు క్లీన్ ఇమేజ్, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. పార్టీ గెలుపుపై ఆశలు పెట్టుకున్నప్పటికీ బీసీ నేత రాజేందర్ ఆశాజనక పనితీరుతో హుజూరాబాద్‌లోనే బీజేపీ తన వ్యూహాన్ని బయటపెట్టాలని చూస్తోంది.
తెలుగుదేశం పార్టీ లేని లోటును పూడ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. తెలంగాణ నుంచి టీడీపీని టీఆర్‌ఎస్ 'ఆంధ్రా పార్టీ'గా తరిమికొట్టింది. ఎన్‌టి రామారావు ప్రారంభించిన ఈ పార్టీ భారతదేశంలో 'బిసిల అనుకూల పార్టీ' అనే పేరు పొందిన ఏకైక పార్టీ టిడిపి మాత్రమే. చంద్రబాబు నాయుడు హయాంలో కూడా.. ప్రభుత్వం మీద కుల ముద్ర పడినప్పటికీ బీసీ అనుకూల ఇమేజ్ కొనసాగింది. ముఖ్యంగా తెలంగాణలో బీసీలు టీడీపీకి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉండేవాళ్లు. తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది బీసీ నేతలు టీడీపీ తరపున ప్రజాజీవితంలో నిలదొక్కుకున్నారు. కాంగ్రెస్‌ను ఎస్సీలు, బ్రాహ్మణులు లేదా అగ్రవర్ణాల పార్టీగా చూస్తున్న తరుణంలో ఎన్టీఆర్ అద్భుతమైన దూరదృష్టితో ఆ పార్టీని మధ్య కులాలకు.. అంటే బీసీలకు దగ్గర చేశారు. ఇది ఎన్టీఆర్ మాస్టర్‌స్ట్రోక్‌గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ, తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆంధ్రా పార్టీ ట్యాగ్‌తో టీడీపీని చిత్తు చేశారు. టీడీపీకి దూరమైతే బీసీలు టీఆర్‌ఎస్‌లోకి వలసపోతారనే ఉద్దేశ్యం కేసీఆర్‌కు ఉందని అనేవారు కూడా ఉన్నారు.
అయితే తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి బీసీ నాయకత్వాన్ని సమర్థవంతంగా ప్రొజెక్ట్ చేయడం ద్వారా బీసీలను తమ వైపు తిప్పుకోవచ్చనే భావనలో బీజేపీ ఉంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత తెలంగాణ విషయంలో ప్రత్యేక వ్యూహాన్ని ఆ పార్టీ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త వ్యూహంపై పార్టీ సీనియర్ నేతలు తగిన సూచనలు చేశారు. తెలంగాణలో వచ్చేసారి బీసీ సీఎం ఎందుకు కాకూడదని పార్టీ సీనియర్ నేత పేరాల శేఖరరావు ప్రశ్నించారు. మూడు దశాబ్దాలకు పైగా ఈశాన్య ప్రాంతంలో పార్టీ కోసం పనిచేసిన రావు హుజూరాబాద్‌లో వెనుకబడిన కులాల మధ్య ప్రచారం చేస్తున్నారు. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) సౌత్ జోన్ చైర్మన్ కావడంతో నియోజకవర్గంలోని బీసీలను కలిసేందుకు రావు సరైన వ్యక్తి. గత నెల రోజులుగా అన్ని బీసీ సంఘాలతో కుల సమావేశాలు నిర్వహించారు. రాజేందర్ ఎన్నిక తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రికి బాటలు వేస్తుందన్న సింగిల్ పాయింట్ చుట్టూనే ఆయన ప్రచారం సాగుతోంది. అస్సాం భాజపా ఇన్‌ఛార్జ్‌గా, ఏజీపీ నుంచి సర్బానంద సోనోవాల్‌ను బీజేపీలోకి తీసుకొచ్చిన ఘనత రావుకు దక్కింది. సోనోవాల్ తర్వాత అస్సాం ముఖ్యమంత్రి అయ్యారు.
శేఖర్‌రావు న్యూస్‌మీటర్‌తో మాట్లాడుతూ 'తెలంగాణ త్వరలో బీసీ ముఖ్యమంత్రి కలిగి ఉండే అవకాశం లేకపోలేదు. హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల గమనాన్ని మార్చబోతోంది. ఇది బీసీ ముఖ్యమంత్రికి బాటలు వేస్తుంది. బీసీలు మాతోనే ఉన్నారు. తెలుగువారికి ఇప్పటి వరకు బీసీ ముఖ్యమంత్రి లేరు. భాజపా నాయకత్వంలో బీసీలు భవిష్యత్తు తెలంగాణ కోసం ఎజెండాను నిర్దేశించుకోనున్నారు అని' చెప్పారు. ముఖ్యమంత్రి అభ్యర్థిపై తాను అంచనా వేయలేనని చెప్పిన శేఖర్ "మా పార్టీ పూర్తిగా బీసీ నేతలతో నిండి ఉంది. మన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బీసీ నాయకుడు, మన నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి బీసీ నాయకుడు. మన జాతీయ బీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ తెలంగాణకు చెందిన బీసీ నాయకుడు. ఇప్పుడు తెలంగాణలో అత్యంత ప్రజాదరణ పొందిన బీసీ నాయకుడు ఈటల రాజేందర్ అని ఆయన అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోపు వెనుకబడిన కులాల వారందరూ బీజేపీకి అండగా ఉంటారని" గట్టిగా విశ్వాసం వ్యక్తం చేశారు.