ఆ మూడు నియోజకవర్గాల్లో విజయం ఎవరిది.. మహిళా నేతలు కూటమి స్టార్స్ కు చెక్ పెడతారా?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నేతలు పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్‌లను ఓడించడంపై ప్రత్యేక దృష్టి సారించింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 April 2024 11:24 AM ISTఆ మూడు నియోజకవర్గాల్లో విజయం ఎవరిది.. మహిళా నేతలు కూటమి స్టార్స్ కు చెక్ పెడతారా?
విజయవాడ: అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 40 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ).. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నేతలు పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్‌లను ఓడించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. పిఠాపురం, హిందూపూర్, మంగళగిరి నియోజకవర్గాల్లో ఆయా నాయకులను ఓడించడంపై వైసీపీ ప్రత్యేక దృష్టి పెట్టింది.
చరిత్ర పునరావృతం చేసేందుకు ప్రయత్నిస్తున్న వైఎస్సార్‌సీపీ:
సోషల్ ఇంజినీరింగ్ విధానం, రాజకీయ లెక్కలను పరిగణనలోకి తీసుకుని పిఠాపురంలో మహిళా అభ్యర్థులుగా వంగగీత, హిందూపురంలో టీఎన్ దీపిక, మంగళగిరిలో మురుగుడు లావణ్యలను వైఎస్‌ఆర్‌సీపీ నాయకత్వం బరిలోకి దింపింది. పలు వర్గాల నుండి మద్దతును బలోపేతం చేయడం ద్వారా ఎన్నికల్లో గెలవడానికి, కుల నేపథ్యాల నుండి అభ్యర్థులను నిలబెట్టాలని YSRCP యోచిస్తోంది. 2019 ఎన్నికల్లో మంగళగిరిలో లోకేష్, భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్‌ను ఓడించడంలో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో లోకేష్, పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణలను ఓడించాలని వైఎస్సార్సీపీ అధిష్టానం భావించింది.
వంగగీత, పవన్ కళ్యాణ్ మధ్య గట్టి పోరు
పిఠాపురంలో వంగ గీత, పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోని ప్రతి గడపకూ తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దాదాపు 40 శాతం మంది ఓటర్లు అంటే 90 వేల మందికి పైగా కాపు ఓటర్లు నియోజకవర్గంలో ఉన్నారు. కాబట్టి, నియోజకవర్గంలో గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఈ సెగ్మెంట్‌లో వెనుకబడిన తరగతులకు చెందిన 80,000 ఓట్లు కూడా ఉన్నాయి.
నాగ్‌పూర్ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి అయిన వంగా గీత రాజకీయవేత్తగా మారారు. 2019లో కాకినాడ లోక్‌సభ స్థానానికి ఎన్నికయ్యే ముందు ఆమె టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పిఠాపురం నియోజకవర్గం నుండి విజయం సాధించారు.
గీత గెలుపు కోసం మిథున్‌రెడ్డిని నియమించిన వైఎస్‌ఆర్‌సీపీ
నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌సీపీ ఉనికిని పటిష్టం చేసేందుకు, వంగగీత విజయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డిని పిఠాపురం సమన్వయకర్తగా నియమించారు. మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభంను వైఎస్సార్‌సీపీలోకి తీసుకురావడంలో మిథున్‌రెడ్డి కీలకపాత్ర పోషించారు. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబును శాంతింపజేయడంలో సఫలమయ్యారు. తొలుత పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా ముద్రగడను పిఠాపురంలో పోటీకి దింపాలని వైఎస్సార్‌సీపీ భావించింది. అయితే కాముద్రగడ పోటీకి దూరంగా ఉన్నప్పటికీ.. నియోజకవర్గంలో పార్టీకి మద్దతు ఇస్తామని జగన్‌కు హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో జనసేన పిఠాపురం అభ్యర్థి మాకినీడి శేషుకుమారిని వైఎస్సార్‌సీపీలోకి తీసుకురావడంలో కూడా మిథున్ రెడ్డి విజయం సాధించారు.
గత ఎన్నికల్లో ఆమె 15 శాతం ఓట్లను సాధించారు. ఆమె జనసేన నుండి నిష్క్రమించడం.. కాపు సామాజికవర్గ ఓటర్లతో పాటూ పార్టీ అవకాశాలను ప్రభావితం చేస్తుంది. కాపు ఓటర్లను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కుల సంఘాల నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి నాలుగున్నరేళ్లలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నియోజకవర్గానికి చేసిన సంక్షేమాన్ని వివరించేందుకు వైఎస్సార్‌సీపీ నాయకత్వం యోచిస్తోంది.
పిఠాపురంను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్:
2019 అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక, భీమవరం నియోజక వర్గాల్లో ఘోర పరాజయం పాలైన పవన్ కళ్యాణ్ కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్న పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే పిఠాపురంను రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని, ఆసుపత్రులు నిర్మిస్తానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌కు మరో ప్లస్ పాయింట్ ఏమిటంటే, టీడీపీ అభ్యర్థి ఎస్‌విఎస్‌ఎన్ వర్మ. మొదట వర్మ పవన్ కళ్యాణ్ అభ్యర్థిత్వంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.. టీడీపీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు హామీతో మనసు మార్చుకుని పవన్ కళ్యాణ్ తో చేతులు కలిపారు.
లావణ్య నుంచి లోకేష్‌కి గట్టి సవాల్!
మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై వైఎస్సార్‌సీపీ నాయకత్వం చేనేత సామాజికవర్గానికి చెందిన 'మురుగుడు లావణ్య'ను బరిలోకి దింపుతోంది. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో లోకేష్ ఓటమి పాలయ్యారు. కొన్ని నెలల క్రితం రామకృష్ణారెడ్డి వైఎస్సార్‌సీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి నియోజకవర్గం నుంచి తప్పుకోవడంతో గంజి చిరంజీవిని పార్టీ అధిష్టానం ఇన్‌ఛార్జ్‌గా నియమించింది.
ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరినా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని అనుకున్నారు. వచ్చే ఎన్నికల్లో లోకేశ్‌పై లావణ్యను పోటీకి దింపాలని వైఎస్సార్‌సీపీ అధిష్టానం నిర్ణయించడంతో పాటు గంజా చిరంజీవి కూడా నియోజకవర్గంలో పార్టీ విజయానికి కృషి చేస్తానని వైఎస్ జగన్‌కు హామీ ఇచ్చారు.
లావణ్య మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె, ఎమ్మెల్సీ ఎం.హనుమంతరావు కోడలు. నియోజకవర్గంలో పార్టీ విజయానికి కృషి చేయడానికి ఆళ్ల రామకృష్ణారెడ్డిని లావణ్యకు ప్రాంతీయ సమన్వయకర్తగా నియమించారు. నియోజకవర్గంలోని వివిధ వర్గాల ప్రజలతో ఆయన మమేకమయ్యారు. బీసీ సామాజికవర్గానికి చెందిన 80 వేల మంది ఓటర్లు, ఇతర కులాలకు చెందిన వాళ్లు మద్దతు ఇవ్వడంతో మంగళగిరిలో కులాల ఓటింగ్ విషయానికి వస్తే లావణ్యకు ప్రయోజనం ఉంది.
వైఎస్ జగన్ కోసం తమ వ్యక్తిగత అజెండాలను పక్కనపెట్టి, లావణ్య విజయం కోసం రామకృష్ణా రెడ్డి, చిరంజీవి కూడా చేతులు కలిపారు. ఇది వైఎస్‌ఆర్‌సీపీ విజయావకాశాలు పెంచే అంశం. మంగళగిరిలో ఓటమి పాలైనప్పటికీ, లోకేష్ ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గంలోని మహిళలు, ఇతర శ్రామిక వర్గాలకు సాధికారత కోసం తన సొంత డబ్బును ఖర్చు చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 1983 నుంచి ఈ నియోజకవర్గంలో టీడీపీ రెండుసార్లు గెలుపొందగా, ఆ తర్వాత కాంగ్రెస్, సీపీఐ, వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలు అయ్యారు.
బాలకృష్ణతో సై అంటున్న దీపిక:
హిందూపురంలో వైసీపీ తరపున దీపికను పోటీకి దింపారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో ఆమె తలపడనున్నారు. బీసీ వర్గానికి చెందిన దీపిక వైఎస్సార్‌సీపీ నేత వేణుగోపాల్‌రెడ్డి భార్య. ఆమె తల్లిదండ్రులు కురుబ సామాజిక వర్గానికి చెందినవారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున పోటీ చేసిన షేక్ మహమ్మద్ ఇక్బాల్ 14,028 ఓట్ల మెజారిటీతో బాలకృష్ణ చేతిలో ఓడిపోయారు.
బాలకృష్ణకు హ్యాట్రిక్ విజయాలను ఇవ్వకూడదనే వ్యూహంలో భాగంగా వైఎస్సార్‌సీపీ పార్టీ సీనియర్ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియోజకవర్గానికి ప్రాంతీయ సమన్వయకర్తగా నియమించింది. గత కొద్ది రోజులుగా హిందూపురంలో ప్రచారాన్ని ముమ్మరం చేసిన పెద్దిరెడ్డి దీపిక గెలుపు కోసం తన శక్తినంతా కూడగట్టుకున్నారు. ఈ నియోజకవర్గంలో ఎస్సీలు 13.6 శాతం, ఎస్టీ జనాభా 4.57 శాతం ఉన్నారు. సమాజంలో పేద, అణగారిన వర్గాలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని పెద్దిరెడ్డి వివరిస్తూ ఉన్నారు. మరోవైపు 1983 నుంచి హిందూపురం టీడీపీకి కంచుకోట.. నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బాలకృష్ణ సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉంటూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడంపైనే దృష్టి సారించారు.