పురందేశ్వరికి ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు.

By Srikanth Gundamalla  Published on  30 July 2023 7:46 AM GMT
Vijayasai Reddy, Counter, Purandeswari, BJP,

పురందేశ్వరికి ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. బీజేపీ అంటే బాబు జనతా పార్టీ కాదు అంటూ ఎద్దేవా చేశారు. పురందేశ్వరి నాన్నగారు మహనీయులు ఎన్టీఆర్‌ మంచి నటులు.. ఆయనలా పురందేశ్వరి కాదనుకున్నాం అంటూ పొలిటికల్‌ పంచ్‌ ఇచ్చారు.

ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. కానీ.. ఇప్పుడే రాష్ట్రంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఒక వైపు టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతుంటే.. మరోవైపు జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయని కాషాయం నేతలు కొందరు చెబుతున్నారు. పలు రాష్ట్రాల్లో బీజేపీ నాయకత్వాలను మార్చిన బీజేపీ.. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని పురందేశ్వరికి ఇచ్చారు. దాంతో.. ఆమె రాష్ట్రంలో కలియ తిరుగుతూ బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వమే టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అవినీతి పాలన కొనసాగిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పురందేశ్వరికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఓ పార్టీలో పని చేస్తూ మరో పార్టీ తరఫున మాట్లాడటం ఏంటి అంటూ ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు.

ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేస్తూ.. అమ్మా, పురందేశ్వరిగారు...బీజేపీ అంటే “బాబు జనతా పార్టీ” కాదు! అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. బాబుది స్క్రిప్ట్‌... వదినది డైలాగ్‌! తండ్రి పెట్టిన పార్టీపై ప్రేమ...మరిది కళ్ళలో ఆనందమే టార్గెట్! అంటూ పురందేశ్వరి తీరుని దుయ్యబట్టారు. మీ నాన్న (ఎన్టీఆర్)గారు మహానటులు... మీరు కాదనుకున్నాం. పార్లమెంటులో ఎన్టీఆర్‌ విగ్రహం పెట్టినప్పుడు సోనియాకు ధన్యవాదాలు పలికిన మీరు అదే ఉత్సాహంతో ఇప్పుడు బీజేపీలో జీవిస్తున్నారంటే మీ నటనాకౌశలాన్ని అభినందించాల్సిందే! అంటూ పురందేశ్వరిపై ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు విసిరారు.

కొన్నాళ్ల నుంచి రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేయడం తగ్గించిన విజయసాయిరెడ్డి మళ్లీ అది షురూ చేశారు. సమయం.. సందర్భం వచ్చినప్పుడు ప్రతిపక్షాలను ప్రశ్నిస్తూనే ఉన్నారు. కాగా.. తాజాగా విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై పురందేశ్వరి ఎలా స్పందిస్తారో చూడాలి.

Next Story