బీజేపీ నేతలు ఫోన్ చేస్తే చెప్పుతో కొడతా.. తుల ఉమ సంచలన కామెంట్స్
తెలంగాణలో ఎన్నికల సమయంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
By Srikanth Gundamalla Published on 11 Nov 2023 1:29 PM ISTబీజేపీ నేతలు ఫోన్ చేస్తే చెప్పుతో కొడతా.. తుల ఉమ సంచలన కామెంట్స్
తెలంగాణలో ఎన్నికల సమయంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టికెట్ దక్కని వారు ఆయా పార్టీలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కొందరికి అయితే వింత అనుభవాలు ఎదురయ్యాయి. మొదట జాబితాలో అభ్యర్థిగా పేరు ప్రకటించినా.. ఆ తర్వాత వారికి బీఫామ్ దక్కలేదు. ఆ క్రమంలో తెలంగాణ బీజేపీ సీట్ల పంపకాలపై ఆ పార్టీలో వ్యతిరేకత కొనసాగుతోంది. చివరి క్షణంలో బీఫామ్ రాకపోవడంతో వేములవాడకు చెందిన తుల ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలను ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశారు.
చివరి క్షణంలో తనకు బీఫాం అందించకపోవడంపై బీజేపీపై తుల ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజెపీ నాయకులు ఫోన్ చేస్తే చెప్పుతో కొడుతా అని తుల ఉమ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్ల తుల ఉమ తన అనుచరులతో సమావేశం అయ్యారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలను అణగదొక్కాలని చూస్తున్నారనీ.. అగ్రవర్గాల వారికి కొమ్ము కాసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె ఫైర్ అయ్యారు. బీజేపీలో మహిళకు స్థానం లేదని తుల ఉమ ఆరోపించారు. తనని బీజేపీ నేతలు నమ్మించి మోసం చేశారని.. చిరవకు వరకు బీఫాం ఇవ్వలేదన్నారు. బీజేపీ నాయకులు తనకు ఫోన్ చేస్తే చెప్పుతో కొడతానంటూ తుల ఉమ సంచలన కామెంట్స్ చేశారు.
తుల ఉమ తన చిన్నతనం నుంచే దొరలతో కొట్లాడుతున్నానని తెలిపింది. బీఆర్ఎస్‌లో కూడా ఓ దొర అహంకారంతోనే బయటకు వచ్చినట్లు చెప్పారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. బీజేపీ కుటుంబ పాలనకు వ్యతిరేకం అన్నారు కానీ.. దొరల కాళ్ల దగ్గర బీఫామ్ పెట్టివచ్చారని తుల ఉమ ఆరోపించారు. దొరల వద్ద చేతులు కట్టుకుని ఉండలేనని.. బీజేపీ నేతలు తన కళ్లలో నీళ్లు తెప్పించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీలో అసలు సిద్ధాంతాలేమీ లేవన్నారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా అని తుల ఉమ వెల్లడించారు. అలాగే.. బీజేపీలో బీసీని సీఎం చేస్తామనేది ఓ బూటకమని అన్నారు. ఏ పార్టీ అనేది నిర్ణయం తీసుకోలేదని కానీ.. వేములవాడ ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానని తుల ఉమ చెప్పారు.