మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేందుకు.. టీఆర్ఎస్ 50 డేస్ యాక్షన్ ప్లాన్..!
TRS readies action plan to wrest Munugode seat.మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు టీఆర్ఎస్ పార్టీ అన్ని రకాల
By తోట వంశీ కుమార్ Published on 6 Sep 2022 6:58 AM GMTమునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా దీన్ని భావిస్తోంది. భారత ఎన్నికల సంఘం(ఈసీ) మునుగోడు ఉప ఎన్నికకు త్వరలోనే నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు టీఆర్ఎస్ బావిస్తోంది. సెప్టెంబర్ నెలాఖరులో నోటిఫికేషన్ విడుదల కానుందని, అక్టోబర్ చివరి నాటికి ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే 50 రోజుల యాక్షన్ ఫ్లాన్‌ను సిద్దం చేసింది.
ఇటీవల తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్ లెజిస్లేచర్ పార్టీ (టీఆర్‌ఎస్‌ఎల్‌పీ) సమావేశానికి ముందు నల్గొండ జిల్లా పార్టీ నాయకులతో టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ భేటి అయ్యారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా నేతలు కార్యాచరణ ప్రణాళికను అందించారు. సెప్టెంబర్ 10న గణేష్ నిమజ్జనం నేపథ్యంలో ఈ కార్యాచరణ ప్రణాళికను వేగంగా అమలు చేసేందుకు వ్యక్తిగతంగా ఇంచార్జులను ఎంపిక చేసి జాబితాను వీలైనంత త్వరగా మంత్రి జి.జగదీశ్‌రెడ్డికి అందజేస్తానని ముఖ్యమంత్రి నల్లగొండ నేతలకు హామీ ఇచ్చినట్లు సమాచారం.
తొలిసారిగా మునుగోడు అసెంబ్లీ స్థానంలోని అన్ని మండలాలు, గ్రామాలు, మున్సిపాలిటీల్లో 1500 మంది నాయకులు, కార్యకర్తలతో 50 రోజులపాటు టీఆర్ఎస్ పార్టీ క్యాంపు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సమాయత్తం చేయనున్నారు.
సీఎం నివేదికను పరిశీలించి త్వరితగతిన ఆమోదం తెలిపారని పార్టీ వర్గాలు తెలిపాయి. వ్యూహం ప్రకారం ఒక్కో ఎమ్మెల్యేకు రెండు గ్రామాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించనున్నారు. మునుగోడు నియోజకవర్గంలో 176 గ్రామాలున్నాయి ఈ లెక్కన 88 మంది ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించనున్నారు. టీఆర్ఎస్‌కు ప్రస్తుతం 103 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. వీరిలో 88 మంది ఎమ్మెల్యేలు 50 రోజులు పాటు మునుగోడు నియోజకవర్గంలోనే ఉండనున్నారు.
ఒక్కో ఎమ్మెల్యే 15 మంది కీలక పార్టీ సభ్యులు లేదా నాయకులను మునుగోడుకు తీసుకురావాలని ఆదేశించనున్నట్లు తెలుస్తోంది. వీరు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పనిచేసి ఓటర్లను కలిసి వారి సాదకబాధలను విననున్నారు. ఇక ఎమ్మెల్యేలు స్వయంగా ఓటర్ల ఇళ్లకు వెళ్లి సంక్షేమ పథకాల లబ్ధిదారులతో మమేకమై ఆసరా పింఛన్లు, దళిత బంధు, సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర చెక్కులను అందజేయనున్నారు.
టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఓటర్లకు మరింత దగ్గర అయ్యేలా.. మునుగోడు ఉప ఎన్నికల్లో కారు దూసుకువెళ్లేలా టీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది.