మీ కథ మీరు చూసుకోండి.. సజ్జలకు షర్మిల కౌంటర్

సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్‌కు వైఎస్‌ షర్మిల కౌంటర్‌ ఇచ్చారు.

By Srikanth Gundamalla  Published on  6 Nov 2023 2:20 PM IST
telangana, ysrtp, sharmila,  sajjala,

మీ కథ మీరు చూసుకోండి.. సజ్జలకు షర్మిల కౌంటర్

వైఎస్‌ఆర్‌ కుటుంబంలో విభేదాల వల్లే షర్మిల తెలంగాణకు వచ్చిందని అంతర్గతంగా ప్రచారం మొదట్నుంచి జరుగుతోంది. అంతేకాదు..ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. వైఎస్ షర్మిల వైఎస్‌ఆర్‌టీపీ పార్టీని స్థాపించినప్పటి నుంచే విమర్శలు చేస్తున్నారు. పార్టీ పెట్టడం ఆమె నిర్ణయమని.. వైసీపీ లైన్ దాటిందంటూ అప్పట్లోనే సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాదు.. తాజాగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో షర్మిల కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికలకు దూరంగా ఉంటున్నామని.. కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని తాము కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. అయితే.. ఈ విషయంపై ఇటీవల స్పందించిన సజ్జల.. షర్మిలపై విమర్శలు చేశారు. జగన్‌ను వేధించిన పార్టీ కాంగ్రెస్‌ అని.. అలాంటి పార్టీకి ఆమె మద్దతు ఇవ్వడం ఏంటో అన్నారు. ఏదీ ఏమైనా ఒక పార్టీ అధ్యక్షురాలిగా ఆమె నిర్ణయం తనదే అని సజ్జల అన్నారు.

అయితే సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్‌కు వైఎస్‌ షర్మిల కౌంటర్‌ ఇచ్చారు. హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడూ.. సజ్జల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ విషయాలకు.. సజ్జలకు సంబంధం ఏంటంటూ ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసిన సమయంలోనే తమతో సంబంధం లేదని సజ్జల చెప్పారని గుర్తు చేశారు. తాము కూడా అదే భావిస్తున్నట్లు చెప్పారు షర్మిల. ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించిన సజ్జల ఇప్పుడెందుకు మా గురించి మాట్లాడుతున్నారంటూ ప్రశ్నించారు. మళ్లీ సంబంధం కలుపుకోవాలని చూస్తున్నారా అని అడిగారు. అంతేకాదు.. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ రాష్ట్రంపై వ్యాఖ్యలు చేశారని చెప్పారు. సింగిల్‌ రోడ్‌ అయితే ఆంధ్రప్రదేశ్‌ అని.. డబుల్‌ రోడ్డు అయితే తెలంగాణ అంటూ విమర్శించారని చెప్పారు. చీకటి అయితే ఏపీ అని.. వెలుగు అయితే తెలంగాణ అంటూ కేసీఆర్‌ కామెంట్స్‌ చేశారని..ఆయన వ్యాఖ్యలపై సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు స్పందించరంటూ షర్మిల నిలదీశారు.

ఇక తాము ప్రజల కోసమే అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనకుండా దూరంగా ఉన్నామని మరోసారి షర్మిల స్పష్టం చేశారు. ఎవరో తమకు కిరీటాలు పెట్టాలని కోరుకోవడం లేదన్నారు. ఇకనైనా తమ గురించి మాట్లాడటం మానుకోవాలని సూచించారు. సజ్జల గారు మీ కథ మీరు చూసుకోండంటూ హితవు పలికారు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల. మరోసారి సజ్జల, వైఎస్ షర్మిల మధ్య రాజకీయ విమర్శలు హీట్‌ ఎక్కడంతో రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది.

Next Story