బీజేపీతో కేసీఆర్‌కు సఖ్యత కుదిరినట్లుంది: సీపీఐ, సీపీఎం

కమ్యూనిస్ట్‌ పార్టీ నేతలు బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ తీరుపై విమర్శలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  22 Aug 2023 1:30 PM GMT
Telangana, Left Parties, CM KCR,

బీజేపీతో కేసీఆర్‌కు సఖ్యత కుదిరినట్లుంది: సీపీఐ, సీపీఎం

బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్‌ ప్రకటించాక రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే.. లిస్ట్‌ విడుదల చేస్తూనే ఎంఐఎంతో మాత్రమే తమ మిత్రపక్షం కొనసాగుతుందని చెప్పారు. గతంలో మునుగోడు ఉపఎన్నికల్లో లెఫ్ట్‌ పార్టీలతో కలిసి ఉన్న బీఆర్ఎస్‌.. ఈసారి మాత్రం వారితో కలిసి ఎన్నికలకు వెళ్లడం లేదు. దాంతో... కమ్యూనిస్ట్‌ పార్టీ నేతలు బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ తీరుపై విమర్శలు చేశారు.

మంగళవారం ఉభయ సీపీఎం, సీపీఐ పార్టీల నాయకులు సమావేశం అయ్యారు. కమ్యూనిస్ట్ పార్టీలు లేకపోతే గత మునుగోడు ఉపఎన్నికల్లో బీఆర్ఎస్‌ పరిస్థితి ఏమై ఉండేదో అందరికీ తెలుసు అని తెలంగాణ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. మునుగోడు ఉపఎన్నిక సమయంలో తమ మద్దతును సీఎం కేసీఆర్ అడిగారని.. బీజేపీ దూకుడుని అడ్డుకోవాలనే తాము బీఆర్ఎస్‌కు అండగా నిలిచామని చెప్పారు. ప్రత్యేక పరిస్థితుల్లో అప్పుడు బీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని కూనంనేని సాంబశివరావు అన్నారు. అయితే.. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో లెఫ్ట్‌ పార్టీలతో కలిసే ఉంటామని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పారని గుర్తు చేశారు కూనంనేని. కానీ అందుకు విరుద్ధం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ మాట్లాడారంటూ విమర్శలు చేశారు.

సీఎం కేసీఆర్ గతంలో తమతో రైతు సమస్యలను కూడా చర్చించారనీ.. ఉత్సాహం వచ్చినప్పుడే తమకు సీఎం ఫోన్ చేశారని అన్నారు. కానీ ఇప్పుడు ఏమైందో తెలిదని అన్నారు. మునుగోడులో మేం మద్దతు ఇవ్వకపోయి ఉంటే.. బీజేపీ గెలిచిఉంటే బీఆర్ఎస్ ప్రమాదంలో పడేది కాదా అని కూనంనేని ప్రశ్నించారు. అయితే.. ఇప్పుడు బీజేపీతో బీఆర్ఎస్‌కు సఖ్యత కుదిరినట్లు ఉందని.. అందుకే కమలం పార్టీ అండదండలు ఉంటే చాలని కేసీఆర్ భావిస్తున్నట్లు ఉన్నారని కూనంనేని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. బీజేపీ దూకుడుని నివారించాలనే మునుగోడు బీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపామని అన్నారు. లెఫ్ట్‌పార్టీలతో కలిసి పోటీ చేస్తామని కేసీఆరే ప్రకటించారు. ఇప్పుడు ఏకపక్షంగా జాబితా ప్రకటించారని తమ్మినేని అన్నారు. తాము కోరిన సీట్లలో కూడా అభ్యర్థుల్ని ప్రకటించారని చెప్పారు. సీట్ల సర్దుబాటు సమస్య కాదనీ.. కేసీఆర్ రాజకీయ వైఖరిలోనే తేడా వచ్చినట్లుందని తమ్మినేని అన్నారు.

Next Story